TDP and YCP Clash in Gudiwada: ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును చంపేస్తామంటూ వైసీపీ నేత బెదిరింపులకు దిగడంతో వివాదం చెలరేగింది. వైసీపీ నాయకుడు మెరుగుమాల కాళీ.. రావి వెంకటేశ్వరావుకి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో మాట్లాడటంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా గుడివాడలో టీడీపీ తరఫున చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతుండగా.. వైసీపీ కార్యకర్తలు పెట్రోల్ సంచులతో టీడీపీ నేతలపై దాడికి యత్నించారు. టీడీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జ్ చేయడంపై పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
రోడ్డుపై జరుగుతున్న వివాదాన్ని చిత్రీకరిస్తున్న మీడియాను సైతం వైసీపీ నేతలు అడ్డుకున్నారు. టీడీపీ నేతలపై దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గుడివాడలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. పెట్రోల్‌తో దాడి చేసిన కాళీ ఇంటికి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొడాలి నాని ప్రోద్భలంతో ఆయన గ్యాంగ్ గుడివాడలో అరాచకం సృష్టించారని రావి వెంకటేశ్వరరావు అన్నారు.
"పెట్రోల్ ప్యాకెట్లు, కత్తులతో తమపై దాడికి వచ్చిన వారిని వదిలేసి.. టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. రంగా వర్ధంతి చేయవద్దని వైసీపీ నేతలు నన్ను బెదిరించారు... ఏం జరిగినా రేపు రంగా వర్ధంతి చేసి తిరుతాం.. రంగా పేద, బడుగు, బలహీన, వర్గాల మనిషి .. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు. వైసీపీ నేతల దాడిపై పూర్తి ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం." -రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నేత
అరాచకమే వైసీపీ వ్యూహం: రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడమే వైసీపీ వ్యూహమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గుడివాడలో అరాచకాలను ఖండిస్తున్నామన్నారు. పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వరరావును చంపుతామంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రంగా వర్థంతి టీడీపీ నిర్వహిస్తే వైసీపీకి అభ్యంతరమేంటి. మేం అధికారంలోకి వస్తే పారిపోయే తొలి వ్యక్తి నానీనే అని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: