దేవాలయాల భూములను పరిరక్షించాల్సిన బాధ్యతల రాష్ట్రప్రభుత్వంపై ఉందని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనువంశిక ధర్మకర్తలకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. దేవాలయల్లో తమ హక్కులను కాపాడాలని హిందూ ఛారిటబుల్ వ్యవస్థాపక ట్రస్టీస్ అసోసియేషన్ ఆరోపించింది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఆందోళన నిర్వహించింది. వంశపారపర్యంగా వస్తున్న హక్కులపై సుప్రీంకోర్టు ఇచ్చిన పన్నాలాల్ తీర్పును అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు.
దేవాలయాల నిర్వహణకు వెచ్చించే ఖర్చుల వివరాలు అనువంశిక ధర్మకర్తలకు చూపకపోవడం సమంజసం కాదని యాదాద్రి ఆలయ ఛైర్మన్, అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహమూర్తి అన్నారు. ఆలయాలకు కార్యనిర్వహణ అధికారి లేకుండా దేవాలయ ధర్మకర్త పరిపాలన ఆధ్వర్యంలో కొనసాగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అనువంశిక ధర్మకర్తలకు ఆలయ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని స్వయంభు వ్యవస్థాపక వంశీయులు పట్వారి ప్రహ్లాద రావు కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఆలయాలను ఆదాయ సంస్థలుగా చూసే ధోరణి మారాలని డిమాండ్ చేశారు.