Temperatures Dropped in Telangana : తుపాను ప్రభావంతో తెలంగాణలో మధ్యాహ్న సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాధారణం కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు (Temperatures Dropped) పడిపోయాయి. దీంతో ప్రజలు పగటి పూటే వణికిపోతున్నారు. గురువారం హనుమకొండ జిల్లాలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలో 7.5, నిజామాబాద్‌లో 7, రామగుండంలో 5.6 డిగ్రీల సెల్సియస్‌లకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
సాధారణం కన్నా రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు : మరోవైపు తెలంగాణలో రాత్రిపూట సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో డిసెంబరు మొదటి వారంలో దాదాపు 12.1 డిగ్రీల సెల్సియస్ నమోదవ్వాల్సి ఉండగా, బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత అదనంగా నమోదవడంతో 19.2 డిగ్రీలకు చేరుకుంది. పటాన్‌చెరులో 12.3 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 19.2 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్, దుండిగల్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, రామగుండం, భద్రాచలంలోనూ 5.9 నుంచి 4.8 డిగ్రీల మధ్య అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత.. హైదరాబాద్‌లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత
గురువారం మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు ఇలా (డిగ్రీలు సెల్సియస్‌లలో)
ప్రాంతం | సాధారణం | నమోదు | వ్యత్యాసం |
హనుమకొండ | 29.9 | 22 | -7.9 |
మెదక్ | 29.9 | 22.4 | -7.5 |
నిజామాబాద్ | 30.8 | 23.8 | -7 |
రామగుండం | 30.5 | 24.9 | -5.6 |
భద్రాచలం | 30.1 | 25.2 | -4.9 |
ఆదిలాబాద్ | 29.5 | 25.3 | -4.2 |
హైదరాబాద్ | 29.4 | 25.4 | -4 |
ఖమ్మం | 29.1 | 27 | -2.1 |
నల్గొండ | 30.2 | 28.5 | -1.7 |
మహబూబ్‌నగర్ | 30.8 | 30.5 | -0.3 |
రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా : మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. నిజామాబాద్, బోధన్‌లను దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఉదయం తొమ్మిదైనా మంచు తేరుకోలేదు. రహదారిపై దట్టంగా మంచు అలుముకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట, హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ పొగ మంచు కురిసింది. ప్రధాన రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు పొగ మంచు ప్రభావంతో అసౌకర్యానికి గురయ్యారు. హనుమకొండ జిల్లా పరకాలలో గత రెండు రోజులుగా కురిసిన వర్షం, పొగ మంచు పడటంతో చలి తీవ్రత (Increased Cold Intensity) విపరీతంగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మంచు కురవడంతో పరిసర ప్రాంతాలన్నీ కశ్మీర్ వాతావరణాన్ని తలపించాయి.
మళ్లీ చలిపులి పంజా.. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రత్తలు
వాతావరణం ఒక్కసారిగా మారడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ముఖానికి మంకీ క్యాప్, మఫ్లర్ వంటివి ధరించాలని సూచిస్తున్నారు. మరోవైపు శీతాకాలంలో పొగమంచు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని పోలీసులు అంటున్నారు. రహదారులపై దట్టంగా పొగ మంచు కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించపోవడం వల్ల జరిగే ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతున్నారు. పొగ మంచు వల్ల రోడ్డు స్పష్టంగా కనిపించకపోతే సురక్షిత ప్రదేశంలో వాహనాలు నిలిపివేయాలని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.
బైక్‌పైనే కుంపటి పెట్టి చలి కాచుకుంటున్న యువకులు
హిమాచల్‌లో చలి పంజా.. గడ్డకట్టిన మంచినీరు.. పైపులను మండించి సరఫరా