తెలుగు టెలివిజన్ ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు టెలివిజన్ పరిశ్రమ ఆదివారం భారీ స్థాయి వేడుకకు సిద్ధమైంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగంలో నివేదన సభ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను ఈరోజు విడుదల చేశారు. తెలుగు టెలివిజన్ టెక్నిషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు 21 యూనియన్ల నుంచి సుమారు 2 వేల మంది కార్మికులు హాజరవుతున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు నాగబాల సురేశ్ కుమార్ తెలిపారు.
ఐదు దశాబ్దాల్లో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వివరిస్తామని ఆయన వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీవీ నగర్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సభకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు, నిర్మాతలు హాజరవుతారని నాగబాల సురేశ్ కుమార్ వెల్లడించారు.