భద్రత కమిషన్, పోలీసు ఫిర్యాదు సంస్థ ఏర్పాటుపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో తెలుగు రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులు తెలంగాణ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. రాష్ట్ర భద్రత కమిషన్, పోలీసు ఫిర్యాదుల సంస్థ ఏర్పాటు చేయాలని గతంలో ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశించినప్పటికీ తెలుగు రాష్ట్రాలు పట్టించుకోవడం లేదంటూ ఓ వ్యక్తి రాసిన లేఖను.. సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కరణ వ్యాజ్యంగా విచారణ చేపట్టింది. ఇవాళ తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఎంఆర్ కిషోర్ కుమార్లు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు.
భద్రత కమిషన్, పోలీసు ఫిర్యాదుల సంస్థ ఏర్పాటు కోసం మరో 8 వారాలు సమయం ఇవ్వాలని తెలంగాణ సర్కారు కోరింది. నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల్లో ఏర్పాటు చేయాలని పేర్కొంది. రాష్ట్ర భద్రత కమిషన్ను ఈనెల 26న ఏర్పాటు చేశామని.. పోలీసు ఫిర్యాదు సంస్థ ఏర్పాటు కోసం మూడు నెలల గడువు కావాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
నిరాకరించిన హైకోర్టు.. నెల రోజుల్లో పోలీసుల ఫిర్యాదు సంస్థ నెలకొల్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: 'తనిఖీ నివేదికలు సమర్పించకుంటే నుమాయిష్ నిర్వహించొద్దు'