నాలుగేళ్లుగా జీఎస్‌టీ వసూళ్ల అంచనాలను తప్పినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతానికి అంచనాల్లో రూ.5.87 లక్షల తేడా ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో ఓ లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘తొలి మూడేళ్లలో రూ.17 లక్షల కోట్లు వసూలవుతాయని అంచనా వేయగా రూ.16.22 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. 2020-21లో రూ.6.90 కోట్ల అంచనా వేయగా, తొలి అయిదు నెలల్లో 26.22% (రూ.1.81 లక్షల కోట్లు) మాత్రమే సమకూరింది. ఈ నాలుగేళ్లలో జీఎస్‌టీ పరిహారం కింద రూ.2.96 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చాం. అందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,410 కోట్లు, తెలంగాణకు రూ.3,223 కోట్లు విడుదల చేశాం’ అని వెల్లడించారు.
గతేడాదితో పోలిస్తే 2020-21లో రాష్ట్రాలకు 30.4% జీఎస్‌టీ వసూళ్లు తగ్గాయన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 26.4%, తెలంగాణకు 26.3%మేర ఆదాయం తగ్గిందని చెప్పారు. తాత్కాలిక అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో ఏపీకి రూ.4,627 కోట్లు, తెలంగాణకు రూ.5,424 కోట్లు పరిహారం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జీఎస్టీ చెల్లింపు విషయంలో న్యాయపోరాటం చేస్తాం: హరీశ్‌రావు