Telugu States Bifurcation Issues: రాష్ట్ర విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ ఈనెల 27వ తేదీన కీలక సమావేశం నిర్వహిస్తోంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరగనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు.
ఏపీ విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, ఇతర సంస్థల పంపిణీ, ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్, అనుబంధ సంస్థ ఆప్మెల్ విభజన అంశాలు ఎజెండాలో ఉన్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థల బకాయిలు, పౌరసరఫరాల సంస్థ నిధుల పంపిణీ, పన్ను ప్రోత్సాహకాలు, కొత్త విద్యా సంస్థల స్థాపన, తదితర అంశాలపై చర్చ జరగనుంది. సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఆయా అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన సమాధానాలు, వినిపించాల్సిన వాదనలను సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విభజన వ్యవహారాలు చూస్తున్న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చర్చించారు. ఆయా అంశాలకు సంబంధించిన ప్రస్తుత స్థితి, ఉన్న అడ్డంకులు, రాష్ట్ర వాదనలపై చర్చించారు.
విద్యుత్ బకాయిల అంశంపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఏపీకి రూ.6700 కోట్ల బకాయిలను చెల్లించాలన్న కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు ఏకపక్షమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరం తెలిపింది. ఇదే సమయంలో ఏపీ నుంచి తెలంగాణకు 17 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశాలన్నీ నివేదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ కూడా పంపారు. సమావేశంలో ఈ అంశాన్ని బలంగా వినిపించాలని భావిస్తున్నారు.
విభజన చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి 9, 10 షెడ్యూళ్ల విభజన జరగాలని మరోమారు స్పష్టం చేయనుంది. సింగరేణి సంస్థ, దాని అనుబంధ ఆప్మెల్, రాష్ట్ర ఆర్ధిక సంస్థల విభజన వివాదాలపైనా గతంలో చెప్పిన అభిప్రాయాన్నే మరోమారు స్పష్టం చేయనున్నారు. స్థానికత ప్రాతిపదికన విభజన జరగాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వాదన.
పౌరసరఫరాల సంస్థ నిధులు, పన్ను ప్రోత్సాహకాలకు సంబంధించి కూడా రాష్ట్ర వాదనలు వినిపిస్తారు. గిరిజన విశ్వవిద్యాలయం, నవోదయ విద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటు అంశం కూడా చర్చకు రానుంది. ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నేడో, రేపో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆయా అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పాల్సిన విషయాలు, ప్రస్తావించాల్సిన వాటిపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: ఘనంగా బతుకమ్మ వేడుకల నిర్వహణపై సర్కార్ దృష్టి.. ప్రత్యేకించి హైదరాబాద్లో..!