GST collections in Telangana : రాష్ట్రంలో వ్యాట్, జీఎస్టీ రాబడుల ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.52,436.21 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఏప్రిల్ నుంచి నవంబరు వరకు గడిచిన ఎనిమిది నెలల్లో రూ.42,159.43 కోట్లు మేర రాబడి వచ్చింది. నిర్దేశించిన లక్ష్యంలో ఇది 80 శాతంగా ఉంది. ఎనిమిది నెలల్లో ఒక్క నవంబరు మినహా గడిచిన 8 నెలల పాటు వరుసగా వ్యాట్, జీఎస్టీల రాబడిలో భారీగా వృద్ధి నమోదైంది. ఏప్రిల్ నెలలో 401 శాతం, మేలో 131 శాతం, జూన్‌లో 20 శాతం, జులైలో 78 శాతం, ఆగస్టులో 31 శాతం, సెప్టెంబరులో 33 శాతం, అక్టోబరులో 44 శాతం వృద్ధి నమోదు కాగా నవంబరు నెలలో మాత్రం 25 శాతం మేర రాబడులు తగ్గాయి.
కేంద్రం నుంచి..
అయినప్పటికీ గడిచిన ఎనిమిది నెలల్లో వ్యాట్, జీఎస్టీ రాబడులు 42 శాతం వృద్ధి నమోదు చేశాయి. అంటే గత ఆర్థిక ఏడాదిలో ఇదే ఎనిమిది నెలల్లో రూ.29,722.48 కోట్లు రాబడి రాగా ఈ ఆర్థిక ఏడాదిలో గడిచిన ఎనిమిది నెలల్లో రూ.42,159.43 కోట్లు వచ్చి 42 శాతం వృద్ధి నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి నవంబరు నెల వరకు గడిచిన ఎనిమిది నెలల్లో పెట్రోల్ అమ్మకాల ద్వారా రూ.8,602 కోట్లు, మద్యం విక్రయాల ద్వారా రూ. 8,566.65 కోట్లు లెక్కన వ్యాట్ రాబడులు వచ్చాయి. జీఎస్టీ కింద రూ.19,028.93 కోట్లు రాగా జీఎస్టీ పరిహారం కింద కేంద్రం నుంచి మరో రూ. 6,876.52 కోట్లు రాబడి వచ్చింది.
ఇదీ చదవండి: GST collections : రూ.1.30 లక్షల కోట్లను దాటిన GST వసూళ్లు