MLA Quota MLCs Oath: ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
రాజ్యసభ సమావేశాల దృష్ట్యా బండ ప్రకాశ్ ప్రమాణస్వీకారానికి గైర్హాజరు కావడంతో... ఐదుగురు ఎమ్మెల్సీలతో ప్రొటెం ఛైర్మన్ భూపాల్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీలు తెలిపారు.
ఆరుగురు ఏకగ్రీవం
ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన తెరాస అభ్యర్థులు ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గులాబీ పార్టీ తరపున బరిలో దిగిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డికి గత నెల 22న రిటర్నింగ్ అధికారి(ఆర్వో) ఎన్నిక ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి ఎవరూ బరిలోకి దిగకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆర్వో ప్రకటించారు.
భారీ కసరత్తు
ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల(TRS Candidates For MLC) జాబితాపై భారీ కసరత్తే చేశారు. చివరి నిమిషంలో వెంకట్రామి రెడ్డి, బండా ప్రకాశ్‌ల పేర్లు జాబితా (TRS Candidates For MLC)లో చేరాయి. అత్యంత వ్యూహాత్మకంగా.. పార్టీ సమీకరణాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలైన కడియం, గుత్తాల ప్రాధాన్యం దృష్ట్యా వారికి అవకాశం ఇచ్చారు. పార్టీ సేవలకు గుర్తింపుగా తక్కెళ్లపల్లి రవీందర్రావును ఎంపిక చేశారు. తనకు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామి రెడ్డితో పాటు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు పార్టీ నేత కౌశిక్‌రెడ్డి పేర్లను జాబితాలో చేర్చారు.
ఎంపీగా ఉన్నా
మండలిలో బలమైన బీసీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం కోసం రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యునిగా 2024 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉన్నా.. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేయడం గమనార్హం.
ఇదీ చదవండి: Nalgonda MLC Elections: ఆసక్తికరంగా ఎమ్మెల్సీ ఎన్నికలు.. క్యాంపులు పెట్టక తప్పదా..?