Corona cases in telangana : రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకు గురిచేస్తుండగా.. క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. కాగా విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. యూకే, కెనడా, అమెరికా, సింగపూర్ నుంచి వచ్చిన 12 మందికి పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి వచ్చిన 9 మందికి... అమెరికా, కెనడా, సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురికి వైరస్ సోకినట్లుగా పరీక్షల్లో వెల్లడైంది. గురు, శుక్ర వారాల్లో విదేశాల నుంచి వచ్చిన 12 మందికి వైరస్ సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కరోనా సోకిన 12 మందికి టిమ్స్‌లో చికిత్స అందిస్తున్నామని... బాధితుల నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ పాజిటివ్ వచ్చినవారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని పేర్కొన్నారు. ఒమిక్రాన్ నిర్ధరణ కాకపోతే బాధితులను హోమ్ ఐసోలేషన్‌లో ఉంచుతామని వివరించారు.
కలవరపెడుతున్న ఒమిక్రాన్
corona cases in TS: కొవిడ్ మహమ్మారి రెండేళ్లుగా రూపు మార్చుకుంటూ ప్రజలను ఏమార్చి గుల్ల చేస్తోంది. కరోనా కోరల నుంచి బయపడుతున్నామని సంబరపడే లోపే ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది మరోమారు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు బయటపడక పోయినా విదేశాల నుంచి ఇటీవల వచ్చిన ఓ మహిళకు పాజిటివ్ అని తేలింది. బాధితురాలికి టిమ్స్‌లో మహిళకు చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు రావాల్సి ఉంది.
క్రమంగా పెరుగుతున్న కేసులు
corona cases increase: రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్‌లో రాష్ట్రంలో రోజుకి సరాసరి 157 వరకు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య రెండొందలకు చేరువవుతుండటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోనూ కరోనా కేసుల సంఖ్యలో మార్పు కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీలో కేసుల పెరుగుదల
covid cases in GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో రోజుకు సుమారు 70 నుంచి 80 వరకు కరోనా కేసులు వస్తున్నాయి. రంగారెడ్డిలో 15 , మేడ్చల్ జిల్లాలో 20 వరకు కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, వరంగల్ అర్బన్‌లో నిత్యం 10 వరకు కేసులు వస్తున్నాయి. ములుగులో కరోనా కేసులు సున్నాకు చేరుకున్నాయనుకుంటున్న తరుణంలో మరోమారు రోజు ఒకటి రెండు కేసులు వస్తున్నాయి.
మాస్కు లేకపోతే వెయ్యి జరిమానా
without mask fine: ఈ ఏడాది ఆరంభంలో సెకండ్ వేవ్‌తో జనం వణికిపోయారు. గత మూడు నెలలుగా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొవిడ్ జాగ్రత్తలు విస్మరిస్తున్నారు. 60 శాతం మంది మాస్కులు సరిగ్గా ధరించటం లేదని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారికి వెయ్యి జరిమానా విధించాలని వైద్యారోగ్య శాఖ పోలీస్ శాఖకు సూచించడం అప్రమత్తంగా ఉండాలనే సంకేతాలనిస్తోంది. కొవిడ్ టీకా సర్టిఫికెట్ లేని వారిని బహిరంగ ప్రదేశాలకు అనుమతించలేమన్న సంకేతాలు ఇస్తోంది.
నిబంధనలు పాటిస్తేనే సేఫ్
covid rules in TS: మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ... కొవిడ్ మార్గదర్శకాలు పాటిస్తే ఏ వేరియంట్ వచ్చినా ప్రాణాలకు ముప్పు ఉండదని వైద్యులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ను భయాందోళనల నేపథ్యంలో టీకాలు తీసుకుంటే మరింత రక్షణ లభిస్తుందని సూచిస్తున్నారు...
ఇదీ చదవండి: Corona Cases in gurukul school : మరో గురుకులంలో కరోనా కలకలం.. విద్యార్థులకు పాజిటివ్