స్వచ్ఛ సర్వేక్షణ్-2021 సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్‌లో భాగంగా రాష్ట్రంలోని 9 నగరాలకు పురస్కారాలు దక్కాయి (Swachh survekshan 2021). కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4300కుపైగా పట్టణాల్లో పోటీలు నిర్వహించింది. ఇందులో చెత్త రహిత పట్టణాల(గార్బెజ్ ఫ్రీ) విభాగంలో గ్రేటర్ హైదరాబాద్, నిజాంపేట కార్పొరేషన్లతోపాటు సిరిసిల్ల, సిద్దిపేట, ఇబ్రహీంపట్నం, ఘట్‌కేసర్, కోస్గి, హుస్నాబాద్ మున్సిపాలిటీలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులు అవార్డులు దక్కించుకున్నాయి.
ఈ మేరకు కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. విజేతలకు ఈ నెల 20న దిల్లీలో విజ్ఞాన్ భవన్‌లో జరిగే స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో అవార్డులు అందిస్తారు.
ర్యాంకులు ఎలా కేటాయిస్తారంటే..
స్వచ్ఛ కార్యక్రమాలు, తడి, పొడి చెత్త వేర్వేరు, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం, ఓడీఎఫ్‌కు చర్యలు, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, 50 మైక్రాన్ల కన్నా... తక్కువ నిడివి ఉన్న ప్లాస్టిక్ నిషేధం, పొడి, తడి చెత్త విడదీయడం లాంటి ప్రశ్నలు ప్రస్తుత 2021 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పొందుపర్చారు.
ఈ ప్రశ్నలకు 1800 మార్కులు... మొత్తం 6వేల మార్కులకు గానూ సర్వీస్ లెవల్ ప్రొగ్రెస్కు 2400 మార్కులు, సర్టిఫికేషన్‌కు 1800 మార్కులు కేటాయించారు. ఈ సర్వే ద్వారా వచ్చిన మార్కులను దేశంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మెట్రో సిటీలకు వచ్చిన మార్కులతో పోల్చి అధికంగా వచ్చిన మార్కుల ప్రాతిపదికంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకింగ్‌లను ప్రకటిస్తారు. ముఖ్యంగా మున్సిపల్ సంస్థలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చేపట్టిన అంశాలపై సమర్పించే నివేదికల ఆధారంగా ర్యాంకుల కేటాయింపు ఆధారపడి ఉంటుంది.
2019లో తెలుగు అవార్డు పొందిన మున్సిపాలిటీలు
స్వచ్ఛ సర్వేక్షణ్‌అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు 2019లో ఏడు అవార్డులు దక్కాయి.తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్ జాబితాలో నిలవగా... ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి నిలిచాయి.
ఇదీ చూడండి: Dharani Meeting: 'ధరణి'పై మంత్రివర్గ ఉప సంఘం భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ