రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతోంది. అమ్మకం పన్ను, జీఎస్టీ ద్వారానే తెలంగాణకు అత్యధిక పన్ను రాబడి సమకూరుతుండగా... మొదటిసారి ఈ ఆదాయాల్లో తక్కువ వృద్ధిరేటు నమోదైంది. రాష్ట్రంలో పటిష్ఠమైన పన్ను వసూళ్ల విధానాలతో 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకూ పన్నుల రాబడిలో సగటున 16 శాతం వృద్ధి రేటు ఉంది. 2017-18లో గరిష్ఠంగా 19 శాతం మేర పన్నుల రాబడి పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం ఉన్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అంచనాలను అందుకోలేకపోయింది.
పెట్రోలియం ఉత్పత్తులపై రాబడి గతంలో కంటే తగ్గగా జీఎస్టీ రాబడుల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే ఉంది. రాష్ట్రాల్లో నిర్దేశించిన మేర జీఎస్టీ రాబడులు రాకుంటే, కేంద్రం పరిహారం ఇచ్చే నిబంధన ఉండటంతో తెలంగాణ రాష్ట్రం పరిహారం తీసుకుంది. ఆరంభంలో మినహా గత ఏడాది వరకూ ఎలాంటి పరిహారం తీసుకోని రాష్ట్రం ఇటీవల రూ.1900 కోట్ల పరిహారం అందుకుంది.
రాబడులపై స్పష్టత
2019-20 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబరులో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ పరిమాణం రూ.1.46 లక్షల కోట్లు. భూముల అమ్మకం ద్వారా రూ.10 వేల కోట్లు సమీకరించాలని నాడు బడ్జెట్ రాబడుల్లో నిర్దేశించారు. ఆ పది వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి రాకపోవడంతో, ఈ మొత్తాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నారు. కేంద్ర పన్నుల వాటా, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో పూర్తి స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించే బడ్జెట్ పది శాతం వృద్ధిరేటుతో ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: మహిళా భద్రతకు పోలీసుల సరికొత్త 'అస్త్రం'!