రైతు బంధు పథకం కింద సొమ్ము అందాల్సిన అర్హులైన రైతుల సంఖ్య ఎంతో లెక్క తేలింది. మొత్తం 59 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చినట్లు రెవెన్యూ శాఖ తాజాగా వ్యవసాయ శాఖకు జాబితా అందజేసింది. వీరిలో భూమి విస్తీర్ణం ప్రకారం రైతుల జాబితాలను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. అర్ధ ఎకరం లోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో తొలుత సొమ్ము జమచేయనుంది. అందులో భాగంగా జాబితాలోని పేర్లను ఒక్కొక్కటిగా పరిశీలించి, వారి బ్యాంకు ఖాతా సంఖ్యల్లో మార్పులుంటే చెప్పాలని గ్రామస్థాయి ‘వ్యవసాయ విస్తరణ అధికారుల’(ఏఈఓ)ను వ్యవసాయశాఖ ఆదేశించింది. అర ఎకరంలోపు భూమి ఉన్న వారికి దాదాపు రూ.1000 కోట్ల వరకూ అందే అవకాశముంది. ఆ సొమ్ము సోమవారం బ్యాంకులకు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఈ చెల్లింపులు పూర్తయిన తర్వాత ఎకరం, అటు పిమ్మట రెండు ఎకరాల వారికి..ఇలా పెంచుతూ వెళ్లేలా సాఫ్ట్ వేర్‌లో పేర్లు నమోదు చేస్తున్నారు.
రూ.1,510 కోట్ల సంగతేమిటి?
గతేడు జూన్ నుంచి సెప్టెంబరు వరకు 54 లక్షల మంది రైతుల వివరాలను వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పంపింది. వీరిలో 10 ఎకరాల్లోపు భూమి ఉన్న 46 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే రైతు బంధు సొమ్ము జమైంది. మిగిలిన దాదాపు 10 లక్షల మందికి ఇంకా రూ.1,510 కోట్లు విడుదల కావాల్సి ఉంది. నిధుల కొరత కారణంగా వారికి చెల్లింపులు జరగడం లేదనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఇటీవల ఈ పథకం కింద రూ.5,100 కోట్ల విడుదలకు వ్యవసాయశాఖ పరిపాలన ఉత్తర్వులు జారీచేసింది. ఖరీఫ్ బకాయిల సొమ్ము విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇందులో లేవు. వారికిస్తారా? లేదా? అన్నదానిపైనా స్పష్టత లేదు.
తాజాగా రబీ(యాసంగి) చెల్లింపులకు సంబంధించి అర ఎకరం భూమి ఉన్నవారి పేర్ల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. అంటే ఈ దఫా కూడా వీరికే ముందు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి పాత బకాయిల సంగతేమిటి? అనేది వ్యవసాయ శాఖ తేల్చకపోవడంతో సదరు రైతులు ఏఈవోలను నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక వారు నానాపాట్లూ పడుతున్నారు.
ఇదీ చూడండి: పురపీఠాధీశులు ఎన్నికయ్యేది నేడే...