త్రిసభ్య కమిటీ అనుమతి లేకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలు విడుదల చేయకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. కుడిగట్టు కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలన్న ఏపీ విజ్ఞప్తిపై బోర్డు తెలంగాణను అభిప్రాయం కోరింది. దానికి స్పందించి లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ... శ్రీశైలం కుడిగట్టు కేంద్రం ద్వారా ఏపీ విద్యుత్ ఉత్పత్తికి అభ్యంతరం లేదని తెలిపారు.
ఇదే సమయంలో శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జునసాగర్, పులిచింతల కేంద్రాల ద్వారా గరిష్ఠ విద్యుత్ ఉత్పత్తికి అనుమతించాలని కోరారు. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, బోర్ల కోసం విద్యుత్ ఉత్పత్తి అవసరమని వివరించారు. కృష్ణా బేసిన్ అవసరాలు తీరకుండా బేసిన్ వెలుపలకు జలాలను తరలించకుండా ఏపీని నిలువరించాలని ఇప్పటికే బోర్డు దృష్టికి, కేంద్ర జలశక్తిశాఖను పదేపదే కోరామని... అత్యున్నత మండలి రెండో సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు. బేసిన్ అవసరాలు తీరకుండా కృష్ణాజలాలను ఇతర బేసిన్లకు ఆంధ్రప్రదేశ్ తరలించకుండా చూడాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది నుంచి కృష్ణా జలాలను చెరిసగం వినియోగించుకోవాలని తెలంగాణ మరోమారు లేఖలో కోరింది.
ఇదీ చదవండి: Car Accident : వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు... వాహనంలో ఐదుగురు!