రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎలాంటి అవకతవకల్లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వార్డులవారీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తదితర అంశాలపై గురువారం ఆయన చర్చించారు.
150 వార్డులకు ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబరు 7న ఉప కమిషనర్లు ప్రచురించారని పార్థసారథి తెలిపారు. అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితాను శుక్రవారం ప్రచురిస్తామని చెప్పారు. దీంతోపాటు వార్డులవారీగా ఓటర్ల జాబితా ఆధారంగా ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాలను శుక్రవారం విడుదల చేస్తామన్నారు. వాటిమీద అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించి నవంబరు 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుందని, దీనిని అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పక పాటించాలని కోరారు. వ్యక్తిగత దూషణలు చేసుకోకూడదని తెలిపారు. అభ్యర్థులు జీహెచ్‌ఎంసీలో ఓటరుగా నమోదై ఉండాలన్నారు. 2016 ఎన్నికల్లో నిర్ణయించిన వార్డుల రిజర్వేషన్లే ఇప్పుడూ కొనసాగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా వార్డువారీగా ఓటర్ల జాబితాలు సక్రమంగా తయారు చేశాకనే ఎన్నికలు నిర్వహించాలని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అన్ని అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాతే ఎలాంటి అవకతవకలు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్, సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డి, సంయుక్త సంచాలకుడు విష్ణుప్రసాద్‌తో పాటు 11 పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.