Telangana State Cabinet Meeting: ఈ నెల 9వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ సమావేశం జరగనుంది. పలు అంశాలపై చర్చించిన అనంతరం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర బడ్జెట్ ఆమోదం గురించి గత నెలలో సమావేశమైన కేబినెట్.. ఆ బడ్జెట్ పూర్తైన తర్వాత.. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు కొన్నింటికి అదే రోజు ఆమోదముద్ర వేసింది. మరిన్ని అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ సమావేశం కానున్నట్లు సమాచారం.
సొంతింటి స్థలం ఉండి.. ఇల్లు నిర్మించుకోవాలనే ఆశయం ఉన్నవారికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇస్తుందని ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాల గురించి చర్చించేందుకు అవకాశం ఉండవచ్చని తెలుస్తుంది. పోడు భూముల అంశంపై సీఎం కేసీఆర్ ఇటీవల స్పష్టత ఇచ్చారు. దీనిపైనా మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి కార్యాచరణ..: ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ అంశంపై కూడా కేబినేట్ చర్చించే అవకాశముంది. ఈ ప్రతిపాదనకు సంబంధించి మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమావేశమై చర్చించింది. ఈ ఉపసంఘం అవసరమైన చోట ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విషయాల గురించి కేబినెట్లో చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దళిత బంధును విస్తరిస్తారని ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. అందుకు తగ్గ విధంగా ముందుకు వెళతారేమో చూడాల్సిందే.
రాష్ట్రంలోని పలు సామాజిక వర్గాలకు చెందిన వాల్మీకి బోయలు, పెద్ద బోయలు మొదలగు వారిని ఎస్టీల్లో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. దానిపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదు. గత నెలలో రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లు ఇవ్వాలని నిర్ణయిస్తూ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి భేటీ అయ్యారు. ఈ పథకం అమలు అయితే దాదాపు కోటి కుటుంబాలకు ఆవాసం కల్పించిన వారవుతారు. 2014లోనే దాదాపు 1.30 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో సొంత జాగా ఉన్న వారికి.. ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.7,350 కోట్లను ప్రవేశపెట్టింది.
ఇవీ చదవండి: