Telangana Budget 2022: రాష్ట్ర బడ్జెట్ వచ్చే సోమవారం ఉభయసభల ముందుకు రానుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ఏడో తేదీన రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనుంది. 2023 సాధారణ ఎన్నికలకు ముందు కేసీఆర్.. నేతృత్వంలోని తెరాస సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే. అందుకు అనుగుణంగానే వార్షిక పద్దును సిద్ధం చేసినట్లు తెలిసింది. కొవిడ్ మూడో ఉద్ధృతి కొనసాగినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు రాబడులు బాగానే ఉన్నాయి. వచ్చే ఏడాదికి ఈ అంచనాలు 20 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.
వచ్చే ఏడాదికి 80 వేల కోట్లు..
వాణిజ్య పన్నుల ద్వారా ఇప్పటికే రూ. 60 వేల కోట్లు ఆర్జించగా... ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 66 వేల కోట్లు దాటుతుందని భావిస్తున్నారు . వచ్చే ఏడాదికి ఈ మొత్తం రూ. 80 వేల కోట్ల వరకు అంచనా వేసినట్లు సమాచారం. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఏడాది రూ. 12 వేల కోట్ల మార్కు చేసుకునే పరిస్థితులు ఉండగా రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ. 15 వేల కోట్లు వస్తాయని భావిస్తున్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రూ. 17 వేల కోట్ల నుంచి రూ. 20 వేల కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జీఎస్డీపీ వృద్ధితో నాలుగు శాతం ఎఫ్ఆర్ఎంబీ పరిమితికి అనుగుణంగా బాండ్ల విక్రయం ద్వారా తీసుకునే రుణాల మొత్తం పెరగనుంది. భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయ లక్ష్యాన్ని బాగానే నిర్దేశించుకున్నట్లు సమాచారం.
సంక్షేమానికి పెద్దపీట...
బడ్జెట్ పరిమాణం పెరగనున్నందున అందుకు తగ్గట్లు కేటాయింపులు పెరగనున్నాయి. సర్కార్ ప్రాధాన్యతలకు అనుగుణంగా సంక్షేమం, వ్యవసాయానికే బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. అన్నింటి కంటే దళితబంధు పథకానికి నిధులు ఎక్కువగా కేటాయించనున్నారు. ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వడ్డీ లేని రుణాలు, ఇళ్ల నిర్మాణం తదితరాలకు నిధుల వాటా పెరగనుంది. సంక్షేమం తర్వాత సాగు రంగానికి కేటాయింపులు ఉండనున్నాయి.
వాటికి కూడా నిధులు...
రైతుబంధు, రైతుబీమాతో పాటు రుణమాఫీకి నిధులు ఉండనున్నాయి. వివిధ దశల్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టుల పనులకు అవసరమైన నిధులు కేటాయించనున్నారు. రోడ్లు , మౌలిక వసతులు , విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయి. ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల్లో వసతులు, మన ఊరు- మన బడి కార్యక్రమాలకు నిధులు ఇవ్వనున్నారు. పీఆర్సీకి అనుగుణంగా ఉద్యోగుల జీతాలు, కొత్త నియామకాలు దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు ఉండనున్నాయి.
కసరత్తు పూర్తి...
ముహూర్తం ఖరారైన నేపథ్యంలో బడ్జెట్ కసరత్తును ఆర్థికశాఖ దాదాపుగా పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తుదికసరత్తు పూర్తి చేయనున్నారు. ఆదివారం జరగనున్న కేబినెట్ భేటీలో బడ్జెట్‌కు ఆమోదముద్ర వేస్తారు.
ఇదీ చూడండి: