Krishna Water Share Row: కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరిసగం వాటా కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయనుంది. ఇటీవలి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలోనే తెలంగాణ ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదని... పాలనా సౌకర్యం కోసం ప్రస్తుతం ఉన్న 34, 66 నిష్పత్తినే కొనసాగిస్తామని కేఆర్ఎంబీ ఛైర్మన్ తెలిపారు. ఆ నిర్ణయంలో తాము భాగస్వామ్యం కాబోమని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ప్రకటించారు. దీంతో ఆ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈఎన్సీలు, అంతరాష్ట్ర వ్యవహారాల విభాగం ఇంజినీర్లు, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, తదితరులతో సమావేశమైన రజత్ కుమార్... సంబంధిత అంశాలపై చర్చించారు.
చెరిసగం వాటా కేటాయించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాయనున్నారు. అటు పోలవరం ఎత్తు పెంపుతో పాటు ప్రాజెక్టు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఎత్తిపోతల పథకంపై కూడా అభ్యంతరం తెలుపుతూ మరో లేఖ రాయనున్నారు. ఈ విషయమై గోదావరి బోర్డుకు ఈఎన్సీ మురళీధర్ ఇప్పటికే లేఖ రాశారు. అయితే కేంద్ర జలశక్తిశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో భవిష్యత్లో తెలంగాణకు నీటి ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రానికి వివరించనున్నారు. జాతీయ హోదా ప్రాజెక్టు అయినందున కేంద్రం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరనున్నారు. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల నిర్వహణ కోసం రూపొందించిన రూల్ కర్వ్స్ ముసాయిదాపై కూడా సమావేశంలో చర్చించారు. ట్రైబ్యునల్ తీర్పులు, రూల్ కర్వ్స్‌లో పొందుపర్చిన అంశాలు, వాటి ప్రభావంపై సమావేశంలో చర్చించారు.
ఇవీ చదవండి: