రాష్ట్రంలో వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సాగు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహ రెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ కలిశారు. ఏరువాక మొదలైన తరుణంలో వ్యవసాయరంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇబ్బందులపై మంత్రులకు వివరించారు. భూసమస్యలు పరిష్కరించి అర్హులైన రైతులందరికీ రైతుబంధు వర్తింపజేయడం సహా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతు బీమా పథకాన్ని 18 నుంచి 75 సంవత్సరాలకు వర్తింపచేయాలని కోరారు.
వ్యవసాయ రుణ ప్రణాళిక వెంటనే విడుదల చేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ప్రభుత్వ బ్యాంకులు, సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. రుణమాఫీ ఒకేసారి చేయాలని కోరారు. చిన్న, సన్నకారు రైతులందరికీ ఉచితంగా విత్తనాలు సరఫరా చేస్తూ రాయితీ విత్తనాలు, రసాయన ఎరువులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. జీవ రసాయనాల పేరిట రైతులను మోసం చేస్తున్న కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సాగు విస్తీర్ణం పెరిగినందున 2,604 క్లస్టర్లకు అదనంగా మరో 600 క్లస్టర్లు పెంచాలని కోరారు.
రాష్ట్రంలో సాగవుతున్న వ్యవసాయ పంటలు... ప్రత్యేకించి పండ్లు, కూరగాయలకు మద్దతు ధరలు ముందుగా ప్రకటించాలని మంత్రి నిరంజన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని మంత్రులకు సమర్పించారు. సాగు సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని మంత్రి ఆ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. అనంతరం గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కలిసి వ్యవసాయ అనుబంధ, గ్రామీణాభివృద్ధి రంగంలో అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'