తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.1,424 కోట్లు నష్టాన్ని మూటగట్టుకుంది. గతంతో పోలిస్తే రూ.178 కోట్ల నష్టం తగ్గింది. అంటే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.1,246 కోట్ల నష్టాన్ని చవిచూసింది. సంస్థను కష్టాల నుంచి గట్టెక్కించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల ఎండీ, ఛైర్మన్‌లను నియమించింది. సంస్థను లాభాల బాటలో నడపడం వీరికి సవాలు కానుంది. గడిచిన ఏడాదిలో కరోనాతో సర్వీసులు తగ్గించడం, ప్రజారవాణాను వినియోగించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవటం, తెలంగాణ, ఏపీల మధ్య అంతర్‌రాష్ట్ర సర్వీసులు లేకపోవటంతో ఆర్టీసీకి (Telangana RTC) నష్టాలు అధికమయ్యాయి. వీటిని నియంత్రించేందుకు హేతుబద్ధీకరణ చేయటంతో సుమారు వెయ్యికి పైగా బస్సులు తగ్గాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజారవాణా వినియోగం పెరిగింది. దసరా పండగ, పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో సుమారు రూ.3.5 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించింది. ఇటీవల ఒకేరోజు రికార్డు స్థాయిలో రూ.14.79 కోట్ల ఆదాయం వచ్చింది.
అధికారుల నివేదిక ఆధారంగా ఛార్జీల పెంపుదల
దీపావళి తరవాత ఆర్టీసీ (Telangana RTC) ఛార్జీలు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడిచిన నెలల్లో సంస్థ వ్యవహారాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తూ ఛార్జీల పెంపుదలకు సుముఖత చూపారు. ఆర్టీసీ (Telangana RTC) ఛార్జీలు ఎంత పెంచితే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతుందో నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇటీవల కాలంలో డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. 50 శాతానికి పైగా నష్టాలకు చమురు ధరలే కారణం. ఈ పరిస్థితుల్లో 15 నుంచి 20 శాతం వరకు ఛార్జీలను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019 డిసెంబరులో కిలోమీటరుకు 20 పైసలు పెంచటంతో పాటు కనీస ఛార్జీలను సవరించింది. ఈ పెంపుదలతో రోజువారీగా రూ.13 కోట్లు ఆదాయం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. దీపావళి తరవాత ఛార్జీలను పెంచితే రోజు వారీగా ఆదాయం రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్ల మధ్య వస్తే.., నష్టాలను నియంత్రించవచ్చన్నది అధికారుల ఆలోచన. అంత భారీగా ఛార్జీలు పెంచితే ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలపై దృష్టి సారించవచ్చన్న అభిప్రాయం అధికారవర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: దెబ్బతీసిన కరోనా పరిస్థితులు.. ఆర్టీసీకి భారీ నష్టం!