Rice Millers Association meet Gangula : రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల్లో బియ్యం నిల్వలు పేరుకుపోయిన క్లిష్ట పరిస్థితుల్లో ఎఫ్‌సీఐ బియ్యం తీసుకోకుండా.. ఆంక్షలు అమలు చేస్తోందంటూ తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. మిల్లింగ్ ఇండస్ట్రీ సమస్యలపై.. సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో భేటీ అయ్యారు.
కేంద్రం ఘర్షణ వైఖరితో పెడుతున్న ఇబ్బందుల వల్ల.. మిల్లర్లతో పాటు రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ.. రాష్ట్రం నుంచి పంపిణీ చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ నాణ్యత బాగాలేవనడం సరికాదని పేర్కొన్నారు. మిల్లుల్లో భారీగా నిల్వలు పేరుకుపోతున్న నేపథ్యంలో.. ఎఫ్‌సీఐ సేకరణను పెంచాలని కోరారు.
రాష్ట్రంలో ఎఫ్‌సీఐ స్టోరేజీ కల్పిస్తే సకాలంలో బియ్యం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కోటి మెట్రిక్ టన్నులకు పైగా ఉన్న ధాన్యం నిల్వల్లో.. కొంత ధాన్యాన్ని వేలం ద్వారా అమ్మాలని ప్రభుత్వానికి విన్నవించారు. ప్రస్తుతం మిల్లులు నిండిపోయిన నేపథ్యంలో.. వచ్చే వానాకాలంలో ధాన్యం సేకరణపై ఆందోళన వ్యక్తంచేశారు. యాసంగి నూక శాతం, వానాకాలం తడిసిన ధాన్యంతో మిల్లింగ్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రిలో చర్చిస్తా.. మిల్లింగ్ ఇండస్ట్రీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ఎఫ్‌సీఐతో చర్చిస్తానని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. రైతుల నుంచి పంట సేకరణ బాధ్యత కేంద్రప్రభుత్వానిది.. సేకరణ బాధ్యత నుంచి తప్పుకుని రైతులను, మిల్లర్లను ఇక్కట్లపాలు చేయడం తగదని పేర్కొన్నారు. ఆంక్షలు అమలుచేయకుండా.. ఎఫ్‌సీఐ బియ్యం సేకరించాలన్నారు. రాష్ట్రంలో.. కేంద్రప్రభుత్వం ఎఫ్‌సీఐ స్టోరేజీ, ర్యాక్ మూమెంట్ పెంచాలని గంగుల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Telangana Milling Industry : త్వరలో ప్రభుత్వ రైస్‌మిల్లులు ఏర్పాటు కానున్నాయి. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రూ.2000 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న ధాన్యం, మిల్లింగ్ సామర్ధ్యం పెంపు, మిల్లుల ఆధునీకరణ, కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవండంలో ఇబ్బందులు, సులభతర మార్గాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. 2014లో 1815 రైస్ మిల్లులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 2574కు మాత్రమే ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఏటా 3 కోట్ల టన్నులు పైగా ఉత్పత్తవుతున్న.. ధాన్యం మిల్లింగ్ చేయడానికి తెలంగాణలో విసృత అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ధాన్యం మిల్లింగ్‌తో పాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక, తదితరాల ప్రాసెసింగ్ సైతం చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ అందిస్తున్న సటాకే, సైలో తదితర కంపెనీల ప్రతినిధులతో చర్చిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా సటాకే కార్పొరేషన్, ఇతర కంపెనీల ప్రతినిధులు తమ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానం మంత్రి గంగుల కమలాకర్‌కు వివరించారు.
ఇవీ చదవండి: