ETV Bharat / state

Telangana Rains : తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. పొంగుతున్న వాగులు.. మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి - Rains in Telangana 2023 latest news

Telangana Rain Alert Today : ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. గోదావరికి ఎగువ నుంచి వస్తున్న వరదతో.. భద్రాచలం వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు పంటలకు జీవం పోశాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షసూచన ఉన్నందున హైదరాబాద్‌లో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 20, 2023, 7:04 AM IST

Updated : Jul 20, 2023, 7:14 AM IST

ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

Telangana Rains Toady : ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండురోజులుగా కురుస్తు..న్న మోస్తరు నుంచి భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు జలకళ సంతరించుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ వద్ద సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారి నీటమునిగింది. మోయ తుమ్మెద వాగు ఉద్ధృతంగా ప్రవహిచండతో లోలెవల్‌ వంతెనపై నుంచి నీరు పారుతోంది. ముందు జాగ్రత్తగా పోలీసులు రాకపోకలను నిలిపివేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు.. ఎగువన చత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు21 గేట్లు ఎత్తి 60,000 క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 38 అడుగుల దాటి ప్రవహిస్తోంది. కాళేశ్వరం, ఇంద్రావతి, ప్రాణహిత, తాలిపేరు నుంచి వస్తున్న ప్రవాహంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.

Rains in Telangana 2023 : భద్రాచలం స్నాన ఘట్టాల ప్రాంతం, దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద.. గోదావరి నది ప్రవాహం ఉద్ధృతంగా పెరుగుతోంది. సీతమ్మ నార చీరల ప్రాంతం వరదలో చిక్కుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నందున.. లోతట్టు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కోరారు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. సమీక్ష అనంతరం భద్రాచలం కరకట్ట వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెంలో వర్షానికి నానిన ఇల్లు కూలిపోయింది. ఇంట్లోని వారంతా పొలం పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరగడంతో.. ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. ఏకధాటి వర్షాలతో రామగుండం ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బురద పేరుకుపోయి భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. 70,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Heavy Rain Alert To Telangana : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యటించారు. వాగుల ఉద్ధృతితో రాకపోకలు నిలిచిపోయిన చల్పాక, ఎలిశెట్టిపల్లి గ్రామాలను పరిశీలించారు. వరద ఎక్కువైతే 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు . ఆదిలాబాద్‌ శివారు ప్రాంతాల్లో చిన్నపాటి వానకే పరిసరాలు చిత్తడిగా మారాయి.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే నెలన్నర ఆలస్యమైందన్న అన్నదాతలు.. ఇకనైనా సాగు సజావుగా సాగాలని ఆకాంక్షిస్తున్నారు.

"ఇన్ని రోజులు మేము వర్షాలు పడటం లేదని ఆందోళన చెందాం. ఇప్పుడు వానలు పడటం మాకు సంతోషంగా ఉంది. పత్తి, ఇతర పంటలకు కొంచెం ఈ వానలు జీవం పోసినట్టు అయింది." - రైతులు

Telangana Rains Toady : భారీ వర్ష సూచనతో హైదరాబాద్‌లోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సమీక్ష సమావేశంలో సూచించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని యంత్రాంగానికి కేటీఆర్ నిర్దేశించారు. ఆవర్తన ప్రభావంతో మరో మూడురోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

ఇవీ చదవండి :

Last Updated : Jul 20, 2023, 7:14 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.