Telangana Police Constable Exam 2023: కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి తెలిపింది. సివిల్ కానిస్టేబుల్‌తో పాటు ఐటీ విభాగం కానిస్టేబుళ్ల తుది రాత పరీక్షను ఒకే రోజు నిర్వహిస్తామని వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సివిల్ కానిస్టేబుల్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఐటీ కానిస్టేబుల్ రాత పరీక్ష ఉంటుందని పోలీస్ నియామక మండలి పేర్కొంది.
ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు హాల్ టికెట్లను పోలీస్ నియామక మండలి వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. హాల్ టికెట్ల విషయంలో సాంకేతిక సమస్యలుంటే పోలీస్ నియామక మండలి అధికారులను సంప్రదించాలని సూచించింది. అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి విశ్వాసం, నమ్మకం, ఏకాగ్రతతో పరీక్షకు హాజరుకావాలని నిపుణులు సూచిస్తున్నారు.
Telangana Constable Final Exam: ఇప్పటికే రాష్ట్రంలో పోలీసు నియామకానికి సంబంధించి పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్, మెకానిక్, డ్రైవర్లు, విపత్తు నిర్వహణ విభాగంలో ఉన్న అభ్యర్థులకు గత నెలలో స్కిల్ టెస్ట్ నిర్వహించింది. అంతే కాకుండా ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ ఎస్సై తుది పరీక్షలు కూడా నిర్వహించింది. ఇప్పుడు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి తుది పరీక్షలు నిర్వహిస్తే నోటిఫికేషన్ ప్రకారం ప్రకటించిన పోలీసు నియామకాలు పూర్తియినట్లే.
గర్భిణీలు, బాలింతలకు మరో ఛాన్స్: ఆరోగ్య కారణాల రీత్యా దేహదారుఢ్య పరీక్షకు హాజరు కాని గర్భిణీలు, బాలింతలకు పోలీస్ నియామక బోర్డు మరో అవకాశం కల్పించింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్ష రాసుకోవడానికి అవకాశం కల్పించారు. అయితే మెయిన్స్‌లో విజయం పొందిన తరువాత వారు ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
అంతే కాకుండా వారి మెడికల్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా సమర్పించాలి. 2022 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకున్న 40 మంది అభ్యర్థులు ఇప్పుడు గర్భం దాల్చడంతో తమకు మరో అవకాశం ఇవ్వాలని కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద గతంలో ధర్నా నిర్వహించారు. వీరి ఆందోళనలకు దిగివచ్చిన పోలీస్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇవీ చదవండి:
TSPSC: టీఎస్పీఎస్సీలో 10 కొత్త పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం
కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై తెలుగులో కూడా CAPF కానిస్టేబుల్ పరీక్ష!
Congress VS BJP: కాంగ్రెస్, బీజేపీ 'కోట్ల' కొట్లాట.. దొందు దొందేనన్న బీఆర్ఎస్