Telangana Ministers Fires on BJP:భాజపా నేతల తీరుపై తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భాజపా నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని.. చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భాజపా నిర్వహించిన విజయ సంకల్ప సభలో నీళ్లు, నియామకాల విషయంలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయం వేదికగా కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు.
'అమిత్‌షా.. తెలంగాణలో నీళ్లు వచ్చింది నిజం కాదా? నీళ్లు ఎలా వచ్చాయో ఇక్కడి రైతులే చెబుతారు. నీళ్లు వచ్చాయనేందుకు పండిన పంటలే నిదర్శనం. ₹లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీళ్లు రానిదే ధాన్యం ఎలా వచ్చింది? మీరెలా కొన్నారు?' - మంత్రి హరీశ్‌రావు
పంజాబ్ తర్వాత అత్యధికంగా వరి పండించేది.. తెలంగాణ అని నీతి అయోగ్ చెప్పిందని మంత్రి హరీశ్ గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ బీడు భూముల్లో పారాయన్నారు. నీళ్ల గురించి భాజపా కార్యకర్తలను కాదు.. తెలంగాణ రైతుల్ని అడిగితే చెప్తారని మండిపడ్డారు. దేశంలో సగటున 3శాతం వ్యవసాయ వృద్ధిరేటు ఉంటే తెలంగాణలో 10శాతం ఉందని తెలిపారు. అమిత్‌షా అవగాహన లేకుండా మాట్లాడి స్థాయిని తగ్గించుకోవద్దని సూచించారు. తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును చదివారని ప్రజలు అనుకుంటున్నట్లు వివరించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికే రోల్‌మోడల్ అన్న మంత్రి.. సంపద పెరిగింది కాబట్టే పెన్షన్ ₹200 నుంచి ₹2వేలకు పెంచామని స్పష్టం చేశారు. నిధులు దక్కినందువల్లే సాగుకు కాళేశ్వరం.. తాగుకు మిషన్ భగీరథ నీళ్లు అందిస్తున్నామన్నారు. కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులిస్తే మరింత అభివృద్ధి జరిగేదని అభిప్రాయపడ్డారు.
'రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు ప్రధాని ప్రకటిస్తారని అనుకున్నాం. ఆర్థిక సంఘం సిఫార్సును మోదీ తప్ప దేశ ప్రధానులందరూ తప్పకుండా అమలు చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని భాజపా మేనిఫెస్టోలో చెప్పింది. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలు ఇప్పటికీ భర్తీ చేయలేదు. తెలంగాణలో ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. ప్రధాని ప్రసంగంలో కూడా అబద్ధాలే చెప్పారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ 26లక్షల కుటుంబాలకే వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ మాత్రం 86 లక్షల కుటుంబాలకు వర్తిస్తుంది. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైన పథకం. 8ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కేంద్రం ఎందుకు తీసుకురావట్లేదు. ₹1050గా ఉన్న సిలిండర్ ధరను తగ్గిస్తామని ఎందుకు చెప్పలేదు’ - మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో డబుల్ ఇంజిన్ కోసం పట్టాలు వేస్తున్నామని భాజపా నాయకులు ప్రకటిస్తున్నారని.. బీసీ గణన చేయనందుకా.. బీసీలకు మంత్రిత్వ శాఖ ప్రకటించనందుకా.. అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కోమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి... భాజపా నేతల తీరుపై ధ్వజమెత్తారు.
''భాజపా ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల, కురుమలకు రెండవ విడత గొర్రెలు పంపిణి చేయకుండా కేంద్రం అడ్డుకుంటుంది. తెలంగాణకు ఏ ఇంజిన్లు అవసరం లేదు. కేసీఆరే అతిపెద్ద ఇంజిన్. తెలంగాణలో బడుగు, బలహిన వర్గాలకు కేసీఆర్ అండగా ఉన్నారు.'' - మంత్రి పువ్వాడ
భాజపా కేవలం కేసీఆర్‌ను తిట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ సభ పెట్టారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బీసీ ప్రధాని కదా.. బీసీల గురించి ఏదైనా ప్రకటిస్తారేమో అని ఆశగా ఎదురు చూశామన్నారు. 56 శాతం జనాభా బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖతో పాటు చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలన్న డిమాండ్ ఎన్నో రోజులుగా ఉందని గుర్తు చేశారు. 7 శాతం అగ్రవర్ణాలున్న వారికి రిజర్వేషన్ తీసుకొచ్చారని మండిపడ్డారు. బీసీలపై కేంద్రానికి ఎందుకు వివక్ష... అని ప్రశ్నించారు. బీసీ జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు.
కేంద్రంలో బీసీ శాఖమంత్రి ఎందుకు ఏర్పాటు చేయడం లేదు. 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం.. అయినా గత 28 రోజులుగా మిల్లులు మూతపడి ఉంటే ఎందుకు మాట్లాడలేదు. ఇప్పటికే మిల్లులు ధాన్యంతో నిండి ఉన్నాయి. ఇప్పుడు వానాకాలం పంట వస్తోంది. ప్రధానితో పాటు పియూశ్ గోయెల్ వచ్చారు మరి ధాన్యం గురించి ఎందుకు నోరు విప్పలేదు. యాదమ్మ వంటలు బాగున్నాయని చెప్పారు. మరి రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదు. బండి సంజయ్ ప్రధానితో శభాష్ అనిపించుకున్నారు కదా ఒక్క పైసా అయినా అడిగారా మీ నియోజక వర్గానికి? తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలగొడతామంటున్నారు కదా.. ముందు మీ ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోండి. వాళ్లు దిక్కులు చూస్తున్నారు. - మంత్రి గంగుల కమలాకర్
ఇవీ చూడండి..