Ministers On Budget: తెలంగాణ ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు రూ.83,989 కోట్లు ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా ఖర్చుచేసిందని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది రైతులు, వ్యవసాయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న మమకారం, చిత్తశుద్ధిని తెలియజేస్తుందని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ఇప్పుడు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని చెప్పారు. గత ఏడాది కంటే ఈసారి వ్యవసాయ శాఖకు అధికంగా నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నట్లు మంత్రి తెలిపారు.
బడ్జెట్ దేశానికే ఆదర్శం.
తెలంగాణ బడ్జెట్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరాలు ప్రకటించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం ఉండేలా రాష్ట్ర బడ్జెట్ రూపొందించారని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తాను నిర్వహిస్తున్న శాఖకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన పల్లె ప్రగతికి రూ.3,330 కోట్లు, మొత్తం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రూ.29,586.06 కోట్లు కేటాయించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే.. గ్రామీణాభివృద్ధి శాఖకు ఈసారి అదనంగా 5 వేల కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దడానికి మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మరో 100 కోట్ల రూపాయలు కేటాయించారని.. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, జనగామలకు కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినట్లయిందన్నారు.
సత్యవతి రాఠోడ్ హర్షం..
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి వాటి నిర్మాణం కోసం ఒక్కో దానికి 25 లక్షల రూపాయల చొప్పున రూ.600 కోట్లు కేటాయించడం, ప్రతి తండాకు రహదారి నిర్మాణం కోసం 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం పట్ల రాష్ట్ర గిరిజనుల పక్షాన హృదయ పూర్వక కృతజ్ఞతలు చెబుతున్నట్లు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. ములుగు జిల్లాలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రూ.100 కోట్ల రూపాయలు, మెడికల్ కాలేజీకి మరో 100 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్‌గా గుర్తించి దాని అభివృద్ధి కోసం 1500 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
ఇలాంటి బడ్జెట్ కేసీఆర్‌కే సాధ్యం..
సమాజంలో అన్నివర్గాల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఈ బడ్జెట్ ఉందని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. దళిత బంధు పథకానికి గతంలో కంటే అధిక కేటాయింపులు చేస్తామన్న హామీని నెరవేర్చారన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ భారీ బడ్జెట్ ప్రతిపాదించడం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పరిధిలోని 1736 దేవాలయాలకు దూపదీప నైవేద్య పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలుచేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ఈ బడ్జెట్లో రూ.932 కోట్లు ప్రతిపాదించారని వెల్లడించారు. అనంతరం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
15.49 శాతం కేటాయించారు..
బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. బడ్జెట్లో ఎస్సీల సంక్షేమం, సముద్ధరణకు రూ.33 వేల 9 వందల 37కోట్ల 75 లక్షలు కేటాయించారన్నారు. అంటే మొత్తం బడ్జెట్లో ఇంది 15.49 శాతమన్నారు.
ఈ ఘటన కేసీఆర్దేే..
స్వరాష్ట్ర సాధన తర్వాత అనతికాలంలోనే తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుందని తెరాస ఎమ్మెల్యే గణేష్ బిగాల సంతోషం వ్యక్తం చేశారు. స్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా దళిత బంధు, వివిధ వ్యాపారాల్లో దళితులకు రిజర్వేషన్లు వంటి అంశాలకు బడ్జెట్ కేటాయింపుల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇవీచూడండి: