How Nizam rule ended: ప్రపంచ చరిత్రలోనే ఓ ప్రత్యేక పుట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. దేశాల విముక్తి కోసం సాగిన ఏ పోరాటానికీ తీసిపోనిదీ తెలంగాణ ప్రజావిప్లవం. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రారంభమైన ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపంతో నిరంకుశ నైజాంను గడగడలాడించింది. 200ఏళ్ల చరిత్రలో తెలంగాణ ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం, పోరాటం దేశ చరిత్రలోనే లేదంటే అతిశయోక్తి కాదు. రజాకార్ల కర్కశత్వానికి రక్త తర్పణం చేసిన అమరుల త్యాగాల జ్ఞాపకాలు ఏ పల్లెను తాకినా ఉసిల్ల పుట్టల్లా కదలాడుతాయి. కథలు కథలుగా చెబుతాయి. ఒక్కో వీరగాథ వింటుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఆత్మ రక్షణ కోసం గ్రామరక్షక కమిటీలు ఏర్పాటు చేసుకున్న బురుజులు, 90 ఏళ్లకు పైబడి నవ యవ్వనంతో కళ్ల ముందే కదలాడుతున్న వందలాది భగత్ సింగ్ లు, చెగువేరాలు నాటి మహోన్నత పోరాటానికి సజీవ సాక్ష్యం.
How Nizam rule ended:తెలంగాణ విముక్తి పోరాటంలో ఆంధ్ర మహా సభది కీలకపాత్ర. ప్రజాస్వామ్య తరహా నిరసనలతో ప్రారంభమైన పోరాటం... సాయుధ రూపు సంతరించుకోవటంలో దశ, దిశ చూపింది ఆంధ్రమహాసభే. 1930లో ఏర్పడ్డ మహాసభ వెట్టిచాకిరీ నుంచి విముక్తి, నిజాం దురాగ తాలపై ప్రధానంగా పోరు సాగించింది. 1946 నాటికి మరింత విజృంభించింది. నాటి నుంచి నేటి వరకు దశాబ్దాలు గడిచినా... తరాలు మారినా... నాటి పోరాట క్రమాన్ని వింటే రోమాలు నిక్కబొడుస్తాయి.
How Nizam rule ended:విప్లవాలు, ఉద్యమాలలో కళా, సాంస్కృతిక రంగాలదీ ప్రధాన భూమికే . ఉద్యమాలకు అండగా నిలిచి తమ పదునైన కవితలతో, రక్తాన్ని మరిగించే కళారూపాలతో కవులు, కళాకారులు ఉర్రూతలూగించిన సందర్భాలు కోకొల్లలు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాల్లో వీరి పాత్ర కనిపిస్తుంది. ఒక పాట, ఒక నినాదం....మొత్తం ఉద్యమగతినే మార్చిన సందర్భాలెన్నో. వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు స్వాతంత్ర్యోద్యమానికి దిక్సూచిగా మారితే... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంటో బండెనక బండికట్టి లాంటి గేయాలు.....నిజాంపై నిప్పుల వాన కురిపించాయి.
ఇదీ చూడండి
1.ప్రతి పల్లె... తెలంగాణ జలియన్ వాలాబాగే...! వందలాది భగత్‌సింగ్‌లు, చెగువేరాలు
2.Veera Bairanpally revolt : రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదురించిన వీరభూమి బైరాన్‌పల్లి