Telangana Letter On AP Projects: కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు 66:34 నిష్పత్తిలో 2022-23 సంవత్సరంలో నీటిని వినియోగించుకొనేలా కృష్ణా నదీయాజమాన్య బోర్డు చేసిన నిర్ణయం చెల్లదని తెలంగాణ పేర్కొంది. రాష్ట్ర న్యాయసమ్మతమైన అవసరాలు తీర్చడానికి వాటాదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరింది. దీంతోపాటు పోలవరం ద్వారా కృష్ణా బేసిన్‌లోకి మళ్లించే గోదావరి నీటిలో 45 టీఎంసీల వాటా, తాగునీటి వినియోగంలో 20 శాతాన్ని మాత్రమే లెక్కల్లోకి తీసుకోవడం, కేటాయించి వినియోగించుకోని నీటిని తదుపరి సంవత్సరానికి క్యారీ ఓవర్ చేయడంపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ కేంద్ర జల్‌శక్తి కార్యదర్శికి ఈ నెల ఆరున లేఖ రాశారు. అందులో ‘‘తెలంగాణ ఏర్పడిన వెంటనే న్యాయసమ్మతమైన వాటా తేల్చడానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరాం.
2020 అక్టోబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశాన్ని లేవనెత్తగా, సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటే అంతర్ రాష్ట్ర జలవనరుల చట్టంలోని సెక్షన్-3 ప్రకారం చర్యలు తీసుకొంటామన్నారు. దీనికి తగ్గట్లుగా సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకొన్నా ఈ అంశం ఇంకా కేంద్రం వద్దనే పెండింగ్‌లో ఉంది. మరోపక్క బచావత్ ట్రైబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల వినియోగంపై 2015లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు 66:34 నిష్పత్తిలో నీటిని వినియోగించుకొనేలా తాత్కాలిక ఏర్పాటు జరిగింది. దీన్నే ప్రతిసంవత్సరం కొనసాగిస్తుండగా, 2021-22లో అభ్యంతరంతోనే అంగీకరించాం. శ్రీశైలం నుంచి 34 టీఎంసీలకు మించి మళ్లించరాదని నిబంధన పెట్టాలని కోరాం.
అయితే మా అభ్యర్థనను పట్టించుకోకుండా బోర్డు 34 టీఎంసీలకు మించి తీసుకోవడానికి అనుమతించింది. 16వ బోర్డు సమావేశంలో 2022-23వ సంవత్సరానికి 50:50 నిష్పత్తిలో నీటి వినియోగం ఉండాలని కోరాం. వినియోగంలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడులకు 105 టీఎంసీలు అవసరం. ఈ ప్రాజెక్టుల కింద 10 నుంచి 12 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, తాగు, పారిశ్రామిక అవసరాలకు కలిపి 575 టీఎంసీలు అవసరం. అయితే కృష్ణాబోర్డు ఏకపక్షంగా 66:34 నిష్పత్తిలోనే కొనసాగుతుందంటూ మే 27న పంపిన మినిట్స్‌లో పేర్కొంది. చర్చలు, పరస్పర అంగీకారం ద్వారా నిర్ణయాలు అమలు చేయాలి తప్ప, ఇలా చేసే అధికారం బోర్డుకు లేదు. బోర్డు తీసుకొన్న ఈ నిర్ణయం న్యాయసమ్మతమైంది కాదు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని పరిష్కరించడానికి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణకు రావలసిన వాటా వచ్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.
పోలవరాన్ని 493.5 టీఎంసీలకే పరిమితం చేయండి
పోలవరం ప్రాజెక్టు ద్వారా కేంద్ర జలసంఘం అనుమతించిన మేరకే నీటిని తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరో లేఖ రాశారు. పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని పెంచారని, దీనివల్ల 493.5 టీఎంసీలకు మించి నీటిని తీసుకొనే అవకాశం ఉందని, ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మిగులు జలాలను వినియోగించుకొనేందుకు అనధికారికంగా చేపట్టిన ప్రాజెక్టులను కూడా ఆపాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా రోజుకు 1.7 టీఎంసీల నీటిని మళ్లించేలా 2009లో కేంద్రజలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపిందని, తర్వాత డిజైన్ మార్చి రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా చేపట్టారని లేఖలో పేర్కొన్నారు.
ఇది తెలంగాణకే కాకుండా ఎగువ రాష్ట్రాలకూ ఆందోళనకరమైన విషయమని, కేటాయించిన దానికంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వినియోగించుకొనే అవకాశం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు కంటే ముందుగానే ప్రయోజనాలు కల్పించడానికి పుష్కర, చాగల్నాడు, తొరిగడ్డ, తాడిపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టారని, పోలవరం వినియోగంలోకి రాగానే ఇవన్నీ ఉండవని, అయితే భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ కోరకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వెంకటనగరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పురుషోత్తమపట్నం, చింతలపూడి రెండుదశలు చేపట్టి గోదావరి బేసిన్ బయటి ప్రాంతానికి నీళ్లివ్వనుందని, ఈ ప్రాజెక్టులకు నికరజలాలు కోరడానికి లేదన్నారు. దీంతో పాటు 350 టీఎంసీలతో చేపట్టిన గోదావరి-పెన్నా అనుసంధానం పరిస్థితి కూడా ఇంతేనని, ఇవన్నీ గోదావరి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టినవేనన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల గోదావరి డెల్టాకు ఉండే 224.3 టీఎంసీలపైనా ప్రభావం పడుతుందని, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అనధికార ప్రాజెక్టులన్నింటిని నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు.
ఇవీ చదవండి: రేపు హైదరాబాద్‌కు తరుణ్‌చుగ్.. జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తు
మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు.. రూ.2.82 కోట్ల నగదు,1.80 కిలోల బంగారం స్వాధీనం