KTR advice for Telangana youth: తెలంగాణ యువత కష్టపడి చదివి తమ కలలను నిజం చేసుకోవాలని, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల, ప్రణాళికతో సాధన చేసి రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాలను పొందాలని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. యువతకు అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రతిభకు పట్టం కడుతూ పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరుగుతోందని తెలిపారు.
KTR letter to Telangana youth : పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోకుండా.. అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా, సానుకూల దృక్పథంతో స్వప్నాన్ని సాకారం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రుల ఆశలను నిజం చేసేందుకు బాగా ప్రయత్నించాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర యువతకు ఆత్మీయ లేఖ రాశారు.
ఇది ఉద్యోగపర్వం: ఇప్పుడు తెలంగాణలో ఉద్యోగపర్వం నడుస్తోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్ల వ్యవధిలో సుమారు రెండు లక్షల 25 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశ చరిత్రను కొత్తగా లిఖించబోతున్నాం. దేశంలో అత్యధిక వేతనాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తోంది.
స్థానికతకే పెద్ద పీట: ఉద్యమ కాలంలో, ఎన్నికల ప్రణాళికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా పూర్తి చేశాం. 2018లో అధికారంలోకి వచ్చాక, 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాం. ఇప్పటికే సుమారు 32 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాం.
గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీలకు అతి త్వరలో నోటిఫికేషన్లను విడుదల చేయనున్నాం. ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించడంతో ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయి.
కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఫలించింది. దీంతో పాటు విద్యార్థులు, యువకుల కోరిక మేరకు ప్రభుత్వం ఉద్యోగార్థులకు వయోపరిమితిని సడలించింది. తద్వారా మరింత మందికి అవకాశం దక్కింది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే.. ఏళ్ల తరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పని చేస్తున్న 10 వేల మంది ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించబోతున్నాం.
17 లక్షల మందికి ‘ప్రైవేటు’ ఉపాధి: ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సైతం ఎన్నో ఆరోపణలు, వివాదాలు నడిచాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వపరంగా ప్రతి ఒక్క ఉద్యోగాన్ని అత్యంత పారదర్శకంగా భర్తీ చేశాం. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదని గ్రూపు-1 ఉద్యోగాల్లోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికాం. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాం. ఇప్పటిదాకా సుమారు 17 లక్షల మందికిపైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణదే.
యువతకు చేయూత: ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తెరాస ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత స్థాయిలో యువత కోసం కోచింగ్ సెంటర్లతో పాటు ఇతర వసతులను ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల తరఫున నిరుద్యోగులకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం.. అని కేటీఆర్ ఆ లేఖలో వివరించారు. కాలం తిరిగి రాదు. ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇప్పుడు ఒకెత్తు. ప్రాణం పెట్టి చదవండి. మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఓ సోదరుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రభుత్వ ఉద్యోగాలను పొంది ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోండి.
ఇవీ చదవండి: