నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణలో ఆస్తుల ఇన్వెంటరీ కీలకం అవుతుందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. ఆస్తుల ఇన్వెంటరీ నిర్వహణపై జలసౌధలో కార్యశాల నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరు నెలలుగా ప్రాజెక్టులు, ఆనకట్టలు, చెరువులు, కాల్వలు, పంప్ హౌజ్‌లు, విద్యుత్ సబ్ స్టేషన్లు, రహదార్లు, వాటి కోసం సేకరించిన భూముల వివరాలు, భవనాలు, యంత్రాలు, క్యాంపు కాలనీలు, గెస్ట్ హౌజ్‌లు, గేట్లు, రెగ్యులేటర్లు, కాలువలపై నిర్మించిన నిర్మాణాలు తదితర ఆస్తుల వివరాలతో ఇన్వెంటరీ రూపొందించారు.
సాగునీటి శాఖ సేకరించిన 12 లక్షల 80వేల ఎకరాల భూములను ఆధారాలతో సహా పొందుపరచామన్న అధికారులు.. ఈ భూమి అంతా సాగునీటి శాఖ పేరు మీదకు బదిలీ చేసినట్లు తెలిపారు. 125 జలాశయాలు, 8,661 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 13,373 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూటర్లు, 17,721కిలోమీటర్ల మేర మైనర్లు, 910 కిలోమీటర్ల పైపులు,125 భారీ, 20 మధ్యతరహా, 13 చిన్న తరహా ఎత్తిపోతలు ఉన్నట్లు చెప్పారు. 38,510 చెరువులు, కుంటలు, 8021 చెక్ డ్యాంలు, ఆనకట్టలు, 175 కిలో మీటర్ల సొరంగాలు, కాలువల మీద లక్షా 26 వేల 477 నిర్మాణాలు, 108 విద్యుత్ సబ్ స్టేషన్లు, 64 రెయిన్ గేజులు, 21 రివర్ గేజులు ఉన్నాయని వివరించారు. భవిష్యత్‌లో సేకరించే భూమి వివరాలను ఐదు దశల్లో పొందుపరచాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
యాభై ఏళ్లుగా సాధించలేని పనిని ఆర్నెళ్లలో సాగునీటి శాఖ ఇంజనీర్లు చేశారని ప్రశంసించిన రజత్ కుమార్.. త్వరలో చేపట్టనున్న శాఖ పునర్వ్యవస్థీకరణలో ఇన్వెంటరీ కీలకం అవుతుందని స్పష్టం చేశారు. సాగునీటి శాఖకు సంబంధించిన అన్ని రకాల ఆస్తులు, వివిధ అవసరాల కోసం సేకరించిన భూముల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు.