రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఛార్జీలు, ప్రభుత్వ చర్యలపై హైకోర్టు మరోసారి మండిపడింది. ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించి 161 ఫిర్యాదులు రాగా.. 38కి సంజాయిషీ నోటీసులు జారీ చేశామని, మూడింటికి అనుమతులు రద్దు చేశామని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది. రాయితీ ఇచ్చిన మూడు ఆస్పత్రుల్లో ఎంతమంది పేదలకు ఉచిత వైద్యం అందించారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వ నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా, నిరాధారంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రతీసారి అసమగ్రంగా నివేదికలు సమర్పిస్తోందని.. ఇది పద్ధతి కాదని అసహనం వెలిబుచ్చింది. కనీసం నోటీసులు ఇచ్చిన ఆస్పత్రులను కూడా నివేదికలో వివరించలేదని తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యహరిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోందన్న హైకోర్టు.. ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకే.. వాటి పేర్లను నివేదికలో ప్రస్తావించడం లేదా అని అడిగింది. ప్రైవేట్ ఆస్పత్రులు చట్టానికి అతీతమా లేదా వాటికి ప్రత్యేక రక్షణలున్నాయా అని ప్రశ్నించింది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలు రిజర్వ్ చేసేలా దిల్లీ తరహాలో ఉత్తర్వులు జారీ చేయాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. సగం పడకలు రిజర్వ్ చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రకటించి నెల రోజులైనా.. ఆ దిశగా చర్యలే కనిపించడం లేదని పేర్కొంది. అమలు చేయని హామీలు ఇవ్వడం ఎందుకని వ్యాఖ్యానించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలు రిజర్వ్ చేస్తారా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకుంటే.. దానికి కారణాలను వివరించాలని స్పష్టం చేసింది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫిర్యాదులపై విచారణ జరపాలని జాతీయ ఔషధ ధరల సంస్థను హైకోర్టు ఆదేశించింది. ఈనెల 22లోగా నివేదిక సమర్పించాలని ఎన్పీపీఏను ఆదేశించిన ధర్మాసనం.. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా రోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ తదితర వివరాలు తెలిపేలా లైవ్ డాష్ బోర్డులు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని మరోసారి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
- ఇదీ చూడండి: సేవ చేసిన ఎద్దుపై రైతు మమకారం.. విగ్రహం ఏర్పాటు