కార్యాలయంలో గోడకు జాతీయ జెండా అతికిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. బహిరంగ ప్రదేశాల్లోనే జాతీయ జెండా ఎగరవేయాలని చట్టంలో ఎక్కడ ఉందని పేర్కొంది.
స్వాతంత్య్ర దినోత్సవం నాడు యాదాద్రి ఈవో గీతారెడ్డి జాతీయ జెండా ఎగరేయకుండా.. తన కార్యాలయంలో అతికించి అవమానించారని పేర్కొంటూ న్యాయవాది నర్సింగోజు నరేష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ జెండాను కించపరిచినందుకు.. ఈవో గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.
కార్యాలయంలో గోడకు అతికిస్తే జాతీయ జెండాను అవమానించిట్లు ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. కరోనా పరిస్థితుల్లో బయటే జెండా ఎగరవేయాలని ఎలా ఒత్తిడి చేస్తారని.. ప్రస్తుతం ఆరోగ్యం ముఖ్యమని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం సహేతుకంగా లేదంటూ హైకోర్టు కొట్టివేసింది.