రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. దీనివల్ల న్యాయ వ్యవస్థ లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు లాక్డౌన్ ఈనెల 28 వరకు కొనసాగనుంది. ట్రైబ్యునళ్లు, జిల్లాల్లోని కోర్టుల లాక్‌డౌన్‌ను ఈనెల 14 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో అత్యవసర, తుది విచారణలో ఉన్న కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించనున్నట్లు తెలిపింది. స్టే ఎత్తివేత వంటి కేసుల్లో ప్రత్యక్ష విచారణ కావాలని ఇరువైపుల న్యాయవాదులు కోరుకుంటే.. జ్యుడిషియల్ అకాడమీలో ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.
ట్రైబ్యునళ్లు, జిల్లాల్లోని కోర్టులు కూడా అత్యవసర విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించాలని హైకోర్టు పేర్కొంది. అత్యవసర సివిల్, క్రిమినల్ కేసులతో పాటు కుటుంబ వివాదాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని కోర్టులకు ఉన్నత న్యాయస్థానం సూచించింది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లోని కోర్టుల్లో ఆన్‌లైన్‌తో పాటు నేరుగా కూడా పిటిషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించింది.