HC On Veena Vani : అవిభక్త కవలలు వీణావాణికి అవసరమైన వైద్యఖర్చులను ప్రభుత్వం భరించాలని హైకోర్టు ఆదేశించింది. వీణావాణిలను వేరు చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు.. వారి కుటుంబానికి వసతి కల్పించాలని కోరుతూ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. వీణావాణిలను వేరు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. వేరు చేయడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యులు చెప్పారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ తెలిపారు. తొమ్మిదేళ్ల పాటు నిలోఫర్ ఆస్పత్రిలో ఉన్న వీణావాణిలను తల్లిదండ్రులకు అప్పగించామని.. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నారన్నారు. భవిష్యత్తులో వీణావాణిలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
వీణావాణిలకు నెలకు రూ.15వేలు అందించేందుకు అనుమతివ్వాలని హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ కోరింది. ఆటోడ్రైవర్ కుమార్తెలు వీణావాణిలకు సహాయం చేస్తామంటే అడ్డేముంటుందన్న హైకోర్టు... హెల్పింగ్ హాండ్ ఫౌండేషన్‌కు అనుమతివ్వడంతో పాటు ప్రత్యేకంగా అభినందించింది. ప్రస్తుతం వారు తల్లిదండ్రుల వద్ద ఉన్నందున స్టేట్ హోంకు తరలించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇదీ చూడండి : పది పరీక్షలు రాస్తున్న అవిభక్త కవలలు వీణా-వాణి