రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదంటూ దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. విద్యా హక్కు చట్టం కింద పాఠశాలల్లో సీట్లు, అర్హుల వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తే.. ఎలా అంటూ ప్రశ్నించింది.
అర్హులైన పేద, బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన విద్యార్థుల వివరాలు సమర్పిస్తే.. కేంద్రం తన వాటా నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలను గతంలో ఎన్నడూ అడగ లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు నివేదిక ఇవ్వాలని కేంద్రం 2018 నవంబరులో లేఖలు రాసిందని ఏఎస్జీ తెలపగా.. అర్టీఈ కింద ఎన్ని సీట్లు ఉన్నాయని మాత్రమే అడిగారని.. 2019లోనే వివరాలు ఇచ్చామని ఎస్జీపీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకోకుండా.. చట్టం అమలయ్యేలా చూడాలని హైకోర్టు పేర్కొంది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. విచారణ నవంబరు 1కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: సమగ్ర ఉద్యాన పంటల విధానం.. గుణాత్మక మార్పే లక్ష్యం