ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్టాన్ని అన్వయించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం 2015లో తీసుకువచ్చిన జీవో 68 అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యులైన డాక్టర్ బి.అరుందతి మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేనారెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ మెడికల్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ ప్రాక్టీషనర్స్ సంఖ్య ఎక్కువగా ఉండేదని... విభజన తర్వాత తక్కువగా ఉండడం వల్ల సభ్యుల సంఖ్యను తగ్గించినట్లు వివరించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం అన్వయించుకునే చట్టంలో మార్పులు చేసుకోవడానికి పూర్తి అధికారం రాష్ట్రానికి ఉందన్నారు. ఈ దశలో ధర్మాసనం స్పందిస్తూ సెక్షన్3(1)కు విరుద్ధంగా ఎలా వెళ్తారని ప్రశ్నించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్యను మాత్రం 13 నుంచి 5కు తగ్గించిందని... నామినేటెడ్ సభ్యులను యథాతథంగా ఉంచిందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ నామినేటెడ్ సభ్యులను తగ్గించకపోవడంలో సహేతుకత ఏంటో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సరైన కారణాలు చూపించేవరకు జీవో 68 అమలును నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: తొలి ఏడాది ఆధారంగా ద్వితీయ ఇంటర్ మార్కులు!