TS High Court stay on Teachers Transfers : తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలపై విధించిన స్టేను హైకోర్టు ఏప్రిల్ 11 వరకు పొడిగించింది. బదిలీల నిబంధనలు సవాల్ చేస్తూ నాన్ స్పౌజ్ కేటగిరీ టీచర్లు వేసిన పిటిషన్ మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం వద్ద మరోసారి విచారణకు వచ్చింది. పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయలేదు. మరోవైపు తమ వాదన కూడా వినాలని కోరుతూ స్పౌజ్ కేటగిరీ టీచర్లు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.
అన్నింటిని కలిపి ఏప్రిల్ 11న విచారణ జరుపుతామన్న ధర్మాసనం.. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని పేర్కొంది. భార్యాభర్తలు, గుర్తింపు పొందిన యూనియన్ నేతలకు బదిలీల్లో అదనపు పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ నాన్ స్పౌజ్ కేటగిరీ టీచర్లు వేసిన పిటిషన్‌పై గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అదే విధంగా ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Interim Orders Of High Court To Stop Teacher Transfers: ఉపాధ్యాయ బదిలీలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ నాన్ స్పౌస్ ఉపాధ్యాయులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14న ఇదే అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం బదిలీలను చేపట్టకుండా స్టే విధించింది. అప్పుడు మార్చి 14 వరకు ఎటువంటి పదోన్నతులు చేపట్టకుండా ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు పదోన్నతులు, బదిలీలపై విద్యాశాఖ జనవరి నెలలో జీవోను జారీ చేసింది. దీనికి తగినవిధంగా జనవరి 27 నుంచి ఈ నెల 19 వరకు ప్రక్రియ చేపట్టేలా షెడ్యూల్ను రూపొందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 73,803 మంది టీచర్లు దీనికి దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ బదిలీలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ.. నాన్ స్పౌజ్ టీచర్ల యూనియన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రభుత్వం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం హడావిడిగా.. చట్టాన్ని పట్టించుకోకుండా ఈ ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దంపతులు ఒకే చోట ఉండేందుకు వీలుగా వారికి అదనపు పాయింట్లు కేటాయించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సౌకర్యం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. మరోవైపు గవర్నర్కు కనీసం సమాచారం లేకుండానే ఈ జీవో ఇవ్వడం విద్యా చట్టానికి విరుద్ధమని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు ఏప్రిల్ 11వరకు స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: