TS High Court on Bank orders: రుణాన్ని తీసుకుని చెల్లించని శ్రీ సరైవాలా అగ్రి రిఫైనరీస్ లిమిటెడ్ కంపెనీ ఖాతాను మోసపూరిత ఖాతాగా ఆంధ్రబ్యాంకు (ప్రస్తుత యూనియన్ బ్యాంకు) ప్రకటించిన ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్‌బీఐ సర్క్యులర్ ఆధారంగా బ్యాంకు నిర్ణయం తీసుకుందంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. మోసపూరిత ఖాతాలుగా ప్రకటిస్తూ బ్యాంకులు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ శ్రీ సరైవాలా అగ్రి రిఫైనరీస్ లిమిటెడ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
శ్రీ సరైవాలా వాదనను తోసిపుచ్చిన కోర్టు...
ఆంధ్రబ్యాంకుతో పాటు కన్సార్షియానికి రూ.617 కోట్లు రుణం తీసుకుని చెల్లించకపోవడంతో, మోసపూరిత ఖాతాగా ప్రకటించే ముందు తమ వాదన వినకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమన్న శ్రీ సరైవాలా కంపెనీ వాదనను కోర్టు తోసిపుచ్చింది. కంపెనీ ఖాతాను సెంట్రల్ ఫ్రాడ్ రిజిస్ట్రీలో నమోదు చేశాక ఇతర బ్యాంకులకు సమాచారాన్ని రహస్యంగానే అందజేస్తామని... దీని లక్ష్యం ఆ బ్యాంకులను హెచ్చరించడమేనన్న బ్యాంకు వాదనతో ఏకీభవించింది. బ్యాంకుల పనితీరు పర్యవేక్షిస్తూ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడం రిజర్వు బ్యాంకు విధుల్లో భాగమని తెలిపింది. ఈ బ్యాంకు 2016లో జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ కూడా పరిపాలనా నిర్ణయంలో భాగమని పేర్కొంది. అన్ని అంశాలను పరిశీలించి మోసపూరిత ఖాతాలుగా ప్రకటిస్తూ బ్యాంకు జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న కంపెనీ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి: PIL IN TS High court : 'స్కూల్‌ను సర్పంచ్ ఆక్రమించుకున్నారు.. చర్యలు తీసుకోండి'