Telangana tax revenue: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రాష్ట్రానికి పన్ను ఆదాయం అంచనాల్లో 31 శాతం సమకూరింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బడ్జెట్‌లో పన్ను ఆదాయం లక్షా 26 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేయగా జులై నెలాఖరు వరకు అందులో 31 శాతం.. అంటే రూ.39 వేల కోట్లు సమకూరాయి. జీఎస్టీ ద్వారా రూ.12 వేల 986 కోట్లు.. స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.4 వేల 910 కోట్లు.. అమ్మకం పన్ను ద్వారా రూ.10 వేల 83 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.5 వేల 777 కోట్లు వచ్చాయి. పన్నేతర ఆదాయం బడ్జెట్ అంచనా అయిన రూ.25 వేల కోట్లకు గానూ 29 శాతానికి పైగా అంటే రూ.7 వేల 432 కోట్లు సమకూరింది.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా ఈ ఏడాది రూ.12 వేల కోట్లు వస్తాయని అంచనా వేయగా.. జులై నెలాఖరు వరకు అందులో 21 శాతం అంటే రూ.2 వేల 867 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్ల మొత్తం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ ఏడాది వివిధ గ్రాంట్ల రూపంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.41 వేల కోట్ల రూపాయలు వస్తాయని భారీగా అంచనా వేశారు. అయితే ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో అందులో కేవలం 4.85 శాతం మేర.. అంటే రూ.1988 కోట్లు మాత్రమే వచ్చాయి.
ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షా 93 వేల కోట్ల రెవెన్యూ అంచనా వేయగా.. మొదటి 4 నెలల్లో అందులో 25 శాతం మేర అంటే రూ.48 వేల 663 కోట్లు ఖజానాకు సమకూరాయి. ఆర్థిక సంవత్సరంలో జులై నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల 340 కోట్లు అప్పుల ద్వారా సమకూర్చుకుంది. బడ్జెట్‌లో పేర్కొన్న రూ.52 వేల 167 కోట్లలో ఇది 19.82 శాతం. జులై నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.55 వేల 538 కోట్లు. బడ్జెట్‌లో పేర్కొన్న వ్యయంలో ఇది 25.36 శాతంగా ఉంది. అందులో రెవెన్యూ వ్యయం రూ.51 వేల 599 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.3 వేల 938 కోట్లు మాత్రమే. ఆయా రంగాల వారీగా చూస్తే సాధారణ రంగంపై చేసిన ఖర్చు రూ.15 వేల 349 కోట్లు కాగా.. సామాజిక రంగంపై రూ.16 వేల 738 కోట్లు, ఆర్థిక రంగంపై రూ.23 వేల 450 కోట్లు వ్యయం చేశారు.
ఇవీ చూడండి.. పదేళ్లుగా ఒకేచోట సబ్‌రిజిస్ట్రార్లు, ఇష్టారాజ్యంగా అవినీతి