Telangana group 4 exam latest news : రాష్ట్ర వ్యాప్తంగా 8వేల 180 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సీ ఈ పరీక్షకు పక్కా ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడింది. మొత్తం ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9లక్షల 51 వేల 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష రాశారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సెక్టరేరియల్ ఎబిలిటీస్ పరీక్షలను అభ్యర్థులు రాయనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్పీఎస్సీ ప్రకటించడంతో.. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లను నిర్వాహకులు మూసివేశారు. అనంతరం వచ్చిన వారినెవరిని అనుమతించలేదు. మరోవైపు కొన్ని చోట్ల వివిధ కారణాలతో అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోయారు. దీంతో వారు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది.
- Group 4 Exam Telangana : గ్రూప్-4 పరీక్ష ప్రారంభం.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్
- Group 4 Exam : కారేపల్లి స్టేషన్లో నిలిచిన రైలు.. ఆందోళనలో గ్రూప్-4 అభ్యర్థులు
Telangana Group 4 Exam 2023 : హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానంద డిగ్రీ కళాశాల సెంటర్‌కు ఆలస్యంగా ఏడుగురు అభ్యర్థులు వచ్చారు. అధికారులు వారిని అనుమతించకపోవడంతో నిరాశతో తిరిగి వెనుతిరిగారు. అలాగే నాచారంలో గ్రూప్ 4 పరీక్షా కేంద్రానికి ఇద్దరు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. నాచారం ప్రతిభ పాఠశాలకు నలుగురు అభ్యర్థులు వివిధ కారణాలతో లేట్‌గా వెళ్లారు. బాలనగర్‌లోని ఓ సెంటర్ వద్దకు ఇద్దరు, సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీకళాశాలకు ముగ్గురు, సంగారెడ్డి సెయింట్ ఆంటోని పాఠశాలకు ఆరుగురు అభ్యర్థులు, జోగిపేట ప్రభుత్వ కాలేజీలో ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షకు హాజరుకాలేకపోయారు. ఆదిలాబాద్‌లో ఆలస్యంగా వచ్చిన 8మంది అభ్యర్థులను పరీక్షహాల్లోకి విడిచిపెట్టకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.
కొంప ముంచిన గూగుల్ మ్యాప్ : చౌటుప్పల్‌లోని కృష్ణవేణి స్కూల్ సెంటర్ కోసం గూగుల్‌లో లొకేషన్ సెర్చ్ చేసుకొని పరీక్ష రాయడం కోసం వచ్చిన గ్రూప్ 4 అభ్యర్థికి నిరాశే మిగిలింది. మ్యాప్ చూపించిన లొకేషన్‌కు చేరుకోగా అది తప్పు అడ్రస్ అని తేలింది. ఆగమేఘాల మీద సరైన చిరునామాకు వెళ్లగా.. నిమిషం ఆలస్యమై పరీక్షను జస్ట్ మిస్ అయ్యారు.
ట్రైన్ ఆలస్యం.. ఆందోళన చెందిన అభ్యర్థులు : ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్లో సాంకేతిక లోపంతో సికింద్రాబాద్ మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. ఇందులో గ్రూప్-4 పరీక్ష రాసే అభ్యర్థులు ఉండగా ఆందోళన చెందారు. దీంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి కొందరు.. మరికొందరు అదే ట్రైన్లో టెన్షన్ టెన్షన్ వాతావరణంలో సమీప పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
ఇవీ చదవండి: