Telangana Govt Cancelled Leave in Health Department : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు, వరదల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు.. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వైద్య సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని.. ఇప్పటికే లీవ్‌లో ఉన్నవారికి సైతం రద్దు చేయాలని పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులు పూర్తి సిబ్బందితో పని చేయాలని వివరించారు. ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను పర్యవేక్షించుకుంటూ అవసరమైన వైద్య సేవలు అందించాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Cancelled Leave in Medical Health Department : మరోవైపు వరదల నేపథ్యంలో ఈ నెల 20 నుంచి కాన్పుకు సిద్ధంగా ఉన్న గర్భిణులను.. దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి వారికి ఉచితంగా ఆహారం, మందులు అందిస్తున్నామని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 503 మంది గర్భిణులను ప్రసవం కోసం సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రకటించారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా నుంచే 80 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇక వర్షాల దృష్ట్యా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ విభాగాలు 24 గంటలు పూర్తి సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఓ కాల్‌సెంటర్‌ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే సరిపడినంత రక్త నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని బ్లడ్ బ్యాంకులను శ్రీనివాసరావు ఆదేశించారు.
Harishrao Review rains in Joint Medak District : ఎడతెరపి లేని వర్షాల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎస్పీలతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. ప్రాజెక్టులు, చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని హరీశ్‌రావు సూచించారు. వానల కారణంగా రహదారులు దెబ్బతిన్న ప్రాంతాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పట్టణాలు, లోతట్టు ప్రాంతాల్లో.. నీరు చేరకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల నుంచి ప్రజల్ని ఖాళీ చేయించి తాత్కాలిక క్యాంపులకు తరలించాలని ఆదేశించారు. మెదక్‌జిల్లా పాపన్నపేట ఏడుపాయల వద్ద వరద ఉద్ధృతి పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని హరీశ్‌రావు తెలిపారు.
ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. మరోవైపు కాన్పు సమయం దగ్గరలో ఉన్న గర్భిణుల ఆరోగ్య వివరాలు తెలుసుకుని.. ప్రసవ సమయానికంటే 3, 4 రోజుల ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని వివరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని రిజర్వాయర్ల పరిస్థితులపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని.. ఈ విపత్కర సమయంలో అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని హరీశ్‌రావు సూచించారు.
ఇవీ చదవండి : Schools Holiday Telangana : వర్షం ఎఫెక్ట్.. రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవు
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ముంబయిలో ఆరెంజ్ అలర్ట్.. స్కూళ్లు బంద్!