Governor Tamilisai on Republic day celebrations : తెలంగాణ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించకుండా.. రాజభవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలన్న ప్రభుత్వ లేఖపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేడుకలు జరగకపోవడం పట్ల ఆవేదన చెందారు. కరోనా పేరుతో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు.
Governor Tamilisai Vs CM KCR : రాజ్‌భవన్‌లోనే ఈ గణతంత్ర వేడుకలకు గవర్నర్ జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ కూడా గణతంత్రి దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకలు జరపకపోవడాన్ని తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.
కొవిడ్ కారణంగా నిరుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల నిర్వహణ విషయమై అప్పట్లో రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన గవర్నర్.. ప్రసంగం కూడా పంపలేదని పేర్కొన్నారు. అయితే కొవిడ్ ఉద్ధృతి కారణంగా రాజ్‌భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
కేసీఆర్‌కు, గవర్నర్ తమిళిసైల మధ్య మొదట్లో విభేదాలు ఉండేవి కావు. పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్ పక్కన పెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరంగానే ఉన్నారు.
రాజ్ భవన్లో గవర్నర్ జెండాను ఆవిష్కరించే సమయంలో సీఎం కేసీఆర్ ఉండాలి.. కానీ వేడుకలకు సీఎం హాజరుకాలేదు. గవర్నర్ ఒక్కరే జెండా ఆవిష్కరణ చేశారు. ఇక ఈసారి ఏకంగా వేడుకలను రాజ్‌భవన్‌లోనే జరపాలని లేఖ పంపడంతో గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో రోజురోజుకు గవర్నర్, సీఎంల మధ్య దూరం పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది.