స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్ వంటి ఇతర సేవా సంస్థలు వివిధ రంగాల్లో విలువైన సేవలను అందిస్తూ ప్రభుత్వాల ప్రయత్నాలకు తోడ్పడుతున్నాయని గవర్నర్ తమిళిసై తెలిపారు. ప్రధానంగా లాక్‌డౌన్ సమయంలో వారు అందించిన సేవ ఎనలేనిదని కొనియాడారు. హైదరాబాద్ రాజ్ భవన్ నుంచి చెన్నైలోని రోటరీ జిల్లా సాంస్కృతిక సమావేశమైన వర్చువల్ రోటరీ సభలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ వారి 'సర్వీస్ ఓవర్ సెల్ఫ్' నినాదం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోటారియన్లను వారి గొప్ప సేవలను అందించడానికి ప్రేరేపిస్తోందని తమిళి సై అన్నారు. దేశంలో పోలియో నిర్మూలనకు రోటరీ చేసిన ప్రయత్నాలు... అంధత్వం లేని భారతదేశంగా తయారు చేయడానికి సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
పిల్లల్లో నిస్వార్థ సేవా స్ఫూర్తిని పెంపొందించడానికి ప్రాథమిక విద్య నుంచి నీతి విలువలను చేర్చడం ప్రారంభించాలని తమిళి సై సౌందరరాజన్ పేర్కొన్నారు. రోటరీ సభ సమావేశంలో భాగంగా చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. మన గొప్ప భారతీయ వారసత్వం, సంస్కృతిని, దాని కళారూపాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: వివేకా బోధనలు విద్యార్థులకు, యువతకు ఆదర్శం: గవర్నర్ తమిళిసై