Sankranti wishes: సంక్రాంతి పండుగ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంటల పండుగ సంక్రాంతి అందరికీ సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. మకర సంక్రాంతికి సంస్కృతి పరంగా గొప్ప ప్రాముఖ్యత ఉందన్న తమిళిసై... ప్రాచీన, మహిమాన్వితమైన సంప్రదాయానికి సంక్రాంతి వేడుకలు అద్దం పడతాయన్నారు. అన్నివర్గాలను సంక్రాంతి వేడుకలు దగ్గర చేస్తాయని తెలిపారు. సంక్రాంతి శుభసందర్భం అందరిలో ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వాన్ని తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించేలా అందరూ కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలకు లోబడే సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని గవర్నర్ సూచించారు.
భోగభాగ్యాలతో తులతూగాలి..
ప్రజలు, రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్న సీఎం.. ప్రజలు సిరిసంపదలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు.
స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని... పంట పెట్టుబడి సాయం, అనేక రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని కేసీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పండుగ వాతావరణం నెలకొల్పినట్లు తెలిపారు. వ్యవసాయానికి రాష్ట్రప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలెదురైనా సమర్థంగా ఎదుర్కొంటామన్న కేసీఆర్... రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను పచ్చదనం నడుమ ఆనందంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీచూడండి: Telangana Bhogi Celebrations: అంబరాన్నంటిన భోగి సంబరాలు.. కోలాటాలతో కోలాహలం