Oil Palm Expansion : రాష్ట్రంలో ఆయిల్‌పాం పంట సాగు ప్రోత్సాహంపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. తెలంగాణలో ఆయిల్‌పాం సాగుకు పుష్కలమైన అవకాశాలు ఉన్న దృష్ట్యా అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఉద్యాన శాఖ చర్యలు ఊపందుకున్నారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలన్న లక్ష్యంతో అధికారులు కార్యచరణ మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో దాదాపు 1,000 ఎకరాల విస్తీర్ణంలో 27 హైటెక్ ఆయిల్‌పాం నర్సరీల్లో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేస్తున్నారు. 2022-23 వానాకాలంలో 2.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పాం మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
పెరగనున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలు..
పర్యవారణహితంగా ఆయిల్‌పాం పంట సాగులో నారు మొక్కల నుంచి నాటే వరకు శాస్త్రీయ పద్ధతుల్లో నాణ్యత ప్రమాణాల పరిశీలించడానికి కమిటీ ఏర్పాటు చేయబోతోంది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీకి అదనంగా వేంసూరులో మరో ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం స్థల సేకరణకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం... బీచుపల్లి ఫ్యాక్టరీని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ - ఆయిల్‌ఫెడ్‌ను ఆదేశించింది. సిద్దిపేటలో 60ఎకరాలు, మహబూబాబాద్‌లో 84 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ఫెడ్ సంస్థ ద్వారా మరో రెండు అత్యాధునిక ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ రానున్న 6మాసాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంతో ఈ ఏడాది రూ.950 కోట్లతో సూక్ష్మసేద్యం సాంకేతిక పరిజ్ఞానం రైతుల క్షేత్రాల్లో ఆయిల్‌పాం సాగు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఉద్యాన శాఖ కమిషనర్ లోక వెంకటరామిరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి ఆలోచన మేరకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామ్ఆయిల్ సాగు చేపట్టి... దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు చర్యలు చేపట్టాం. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. దానిని 40లక్షలకు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది 5లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 2.5లక్షల ఎకరాలకు సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో 26 జిల్లాల్లో వెయ్యి ఎకరాల్లో హైటెక్ నర్సరీలు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది రూ.950 కోట్లు ఖర్చుచేసి ప్లాంటేషన్, డ్రిప్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాం. -లోక వెంకటరామిరెడ్డి, ఉద్యాన శాఖ కమిషనర్
ఆ లోటును భర్తీ చేసేందుకు..
ప్రపంచంలో వంట నూనెల వినియోగంలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. ఏటా దేశంలో 102 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగంలో ఉంది. భారత్‌లో 22 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి నూనెలు అవసరం ఉండగా... ఇప్పుడు కేవలం 7 మిలియన్ మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తవుతోంది. వ్యత్యాసం 15 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉంది. ఆ లోటు భర్తీ చేయడానికి మలేషియా, ఇండోనేషియా, థాయిల్యాండ్ వంటి దేశాల నుంచి ఏటా ముడి వంట నూనెల దిగుమతుల కోసం రూ.69,900 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. దేశంలో సగటు వినియోగం మాత్రం 16 కిలోలు ఉంది. ఇది ఏయేటికాయేడు పెరుగుతోంది.
తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు..
గతంలో దేశానికి అవసరమైన వంట నూనెల లోటు అధిగమించేందుకు నూనెగింజల పంటల సాగు, విస్తీర్ణం పెంచాలని 1990లో కేంద్రం... నేషనల్ ఆయిల్‌పాం మిషన్ ప్రవేశపెట్టింది. ఈ మిషన్ కింద 40 నుంచి 50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం పంట సాగు చేయాలన్నది లక్ష్యం. అప్పట్లో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినప్పటికీ విధి విధానాలు లోపభూయిష్టంగా ఉండటం, నిధుల కేటాయింపులు అస్తవ్యస్థంగా ఉండటం, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగకపోవడం వెరసి ఆ పథకం విఫలమైంది. గత అనుభవాల నేపథ్యంలో 2021లో ప్రధాని నరేంద్రమోదీ... నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, ఆయిల్‌పాం ప్రవేశపెట్టారు. ఈ మిషన్ కింద 2025 నాటికి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌సహా దేశవ్యాప్తంగా సాగుకు అవకాశంగల రాష్ట్రాల్లో 6.5 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పాం సాగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత దేశంలో 2020-30 నాటికి 40 లక్షల ఎకరాలకు విస్తీరింపజేయాలని లక్ష్యం. కేంద్రం సహకారం లేకపోయినా దేశంలో ఆయిల్‌పాం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని ఉద్యాన శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
అంతర పంటలపై దృష్టి..
ఆయిల్‌పాం సాగుకు బంగారు భవిష్యత్తు ఉన్న దృష్ట్యా సమగ్ర వ్యవసాయ విధానంలో ఔత్సాహిక రైతుల క్షేత్రాల్లో అంతర పంటలుగా లెమన్, సిట్రోనిల్లా గ్రాస్, దవనం, మరవం, మల్బరీసహా... చుట్టూ శ్రీగంధం, టేకు మొక్కలు నాటించాలని ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. 30 ఏళ్లపాటు ప్రతి నెలా ఆదాయం ఇచ్చే ఆయిల్‌పాంతోపాటు ఆ పంట కాలం ముగిసే సమయానికి సరిగ్గా శ్రీగంధం, టేకు ద్వారా అదనంగా కోటి నుంచి కోటిన్నర రూపాయల నికర ఆదాయం లభించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.
ఇదీ చూడండి : MRF India Expansion : సంగారెడ్డిలో వెయ్యికోట్లతో ఎంఆర్ఎఫ్ ఇండియా విస్తరణ