Rythu Bandhu funds Release on Telangana Government : రైతుబంధు పథకం ద్వారా తెలంగాణలో సాగు విప్లవం కొనసాగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సాగు నీటి రాక, ఉచిత కరెంటు సరఫరా ద్వారా యోగ్యమైన ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకున్న రంగాలు బలోపేతం అవుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని ప్రస్తావించారు.
ఆహార శుద్ది పరిశ్రమలతో రూపుమారనున్న తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమిస్తుందని స్పష్టం చేశారు. 'ఆరుగాలం కష్టపడే రైతు నాలుగు పైసల లాభం కండ్ల చూడాలన్నదే' ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆ లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. రైతుబంధు నిధులు రైతులు సద్వినియోగం చేసుకోవాలి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
- 'రైతు బంధుని కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు'
- BANDI SANJAY: 'రైతు బంధు' పేరుతో సాగు పథకాలన్నీ ఎత్తేశారు
రైతుబంధు రెండో రోజు నిధుల విడుదల: మరోవైపు రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద రెండో రోజు రూ.1278.60 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 16 లక్షల 98వేల 957 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయింది. ఈ ఏడాది వానా కాలం సీజన్ సంబంధించి రెండు రోజుల్లో మొత్తం 39లక్షల 54వేల 138 మంది రైతుల ఖాతాల్లో రూ.1921.18 కోట్లు జమ అయ్యాయి. మొత్తం 38.42 లక్షల ఎకరాలకు అందిన రైతుబంధు సాయం అందింది.
నైరుతి రాకతో అన్నదాతలు వరినాట్లు వేసి సాగుకు సిద్ధమవ్వగా.. సోమవారం రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. తొలిరోజు ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు రూ. 642.52 కోట్ల నిధుల్ని రైతుబంధు కింద విడుదల చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు జమ చేశారు. మొదటి రోజు సుమారు 22లక్షల 55వేల 81మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.
Telangana Rythu Bandhu 2023 : ఇటీవల కాలంలో ధరణి పోర్టల్‌లో పార్ట్-2లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం పొంది కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం వచ్చిన రైతులకు కూడా ఈసారి రైతుబంధు కింద సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి లక్షా 50 వేల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తింపజేసి గిరిజన రైతులకు రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు రైతుబంధు ద్వారా ప్రభుత్వం ముందస్తు పెట్టుబడి సాయం ఇవ్వడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ధ్యానం కొనుగోలు పక్రియలో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: