Covid Guidelines: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల అమలును ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 10 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈనెల 10 వరకు ఆంక్షలు విధించింది. కొవిడ్ కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జీవో నం.1ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేశారు.
కొవిడ్‌పై ఉన్నతస్థాయి సమీక్ష
covid restrictions: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో, మనదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కొవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వైద్య-ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
జనాలు గుమిగూడే వాటికి అనుమతి లేదు..
cs somesh kumar review on covid: కొవిడ్ నియంత్రణా చర్యల్లో భాగంగా ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలన్న సీఎస్... రాజకీయ, మతపరమైన, సాంస్కృతికపరమైన సభలు, సమావేశాలు, ఎక్కువ మంది జనాలు గుమిగూడే వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతుల్లేదని స్పష్టం చేశారు. ప్రజారవాణా, దుకాణాలు, మాల్స్ కార్యాలయాల్లో మాస్క్ ధారణ, భౌతిక దూరం పాటించడం లాంటి వాటిని కచ్చితంగా అమలయ్యేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆవరణలను తరచూ శానిటైజ్ చేయడంతో పాటు థర్మల్ స్కానర్లతో వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించాలని చెప్పారు.
విధిగా మాస్క్‌లు ధరించాలి..
పాఠశాలలు, విద్యాసంస్థల్లోనూ సిబ్బంది, విద్యార్థులు విధిగా మాస్కులు ధరించడంతో పాటు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగే వారికి వెయ్యి రూపాయలు జరిమానాను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని కోరారు. ప్రత్యేకించి వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:
Telangana omicron cases: రాష్ట్రంలో మరో 12 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు