అప్పులు.. నష్టాల్లో కూరుకుపోతున్న ఆర్టీసీని సంస్కరించేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ప్రస్తుత సమ్మె సమయంలో ఆ సంస్కరణలను వేగవంతంగా అమలు చేయాలని యోచిస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం అందులో ముఖ్యమైంది. ప్రత్యామ్నాయ రవాణా విధానంపై ముఖ్యమంత్రి నేడు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అందులో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎప్పట్నుంచో ప్రయత్నాలు
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సంస్థను గాడిలో పెట్టేందుకు గడిచిన కొంత కాలంగా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఆర్టీసీని మూడుగా విభజించి వికేంద్రీకరణ ద్వారా జవాబుదారీతనాన్ని తీసుకురావాలని రెండేళ్ల కిందటే భావించారు. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ వేసినప్పటికీ ఆ నివేదిక కాగితాలకే పరిమితమైంది. సమ్మె చేస్తామంటూ ఆర్టీసీ కార్మికులు కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయ రవాణా విధానంపై ప్రభుత్వం మళ్లీ మేధో మథనం మొదలుపెట్టింది. ఆర్టీసీ స్వరూప స్వభావాల్లో మార్పులు తీసుకొచ్చేందుకున్న అవకాశాలను పరిశీలిస్తోంది.
ఇక అద్దె బస్సులే?
ప్రభుత్వం రూపొందించనున్న ప్రత్యామ్నాయ ప్రణాళికలో కీలకాంశం ప్రైవేటు బస్సుల పెంపేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2,093(దాదాపు 20 శాతం) ప్రైవేటు బస్సులున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 2,600 అద్దె బస్సులు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం శుక్రవారం ప్రకటించడం ఈ వాదనకు బలమిస్తోంది.
20... 50
నిజానికి 2015కు ముందు నుంచే అద్దె బస్సుల విధానం ఆర్టీసీలో అమల్లో ఉంది. అప్పట్లో వాటి వాటా 18 శాతం. 2015 ప్రాంతంలో ఆ సంఖ్యను 25 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 20 శాతం వరకు అద్దె బస్సులున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సంస్థలో అద్దె బస్సులను కాస్తంత అటూ ఇటుగా 50 శాతానికి పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. కేంద్రం రాయితీ కింద రాష్ట్రానికి ఇచ్చిన 350 విద్యుత్తు బస్సులను ఇటీవల ఆర్టీసీ ప్రైవేటు వారి నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకుని, నిర్వహణను వారికే అప్పగించింది. శుక్రవారం ప్రకటించినట్టుగా 2,600 అద్దె బస్సులను తీసుకున్న పక్షంలో ఆ సంఖ్య 2,950కి చేరుకుంటుంది. సంస్థలో ఇప్పటికే ఉన్న 20 శాతం ప్రైవేటు బస్సుల్ని కూడా కలుపుకొంటే వాటి వాటా దాదాపు 50 శాతానికి చేరుకుంటుంది. ఈ పరిణామం ఆర్టీసీలో ప్రస్తుతం చర్చకు దారితీసింది.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై నేడు కీలక నిర్ణయం..!