తెలంగాణలో కొత్తగా ఆరు కళాశాలల మంజూరుతో ప్రభుత్వ వైద్యరంగానికి ఊతమివ్వడంతో పాటు పేద విద్యార్థులకు వైద్యవిద్యను ఉచితంగా అందించేందుకు వెసులుబాటు కలగనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తొమ్మిది వైద్య కళాశాలలుండగా.. కొత్తగా మంజూరైన ఆరుతో కలిపి ఈ సంఖ్య 15కి చేరనుంది. ఒకేసారి ఒక రాష్ట్రంలో ఇన్ని ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఇదే ప్రథమంగా చెబుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈఎస్‌ఐ, బీబీనగర్ ఎయిమ్స్‌తో కలిసి రెండు కళాశాలలున్నాయి. ప్రైవేటు పరిధిలో మరో 23 ఉన్నాయి. ఇలా మొత్తం వైద్యకళాశాలల సంఖ్య 40కు చేరనుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని తొమ్మిది కళాశాలల్లో ప్రస్తుతం 1,640 సీట్లున్నాయి. ఈఎస్‌ఐ, ఎయిమ్స్‌లో కలిపి 150 సీట్లున్నాయి. కొత్త కళాశాలల్లో 600 నుంచి 1200 వరకు సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉస్మానియా, గాంధీ, వరంగల్ కాకతీయ, నిజామాబాద్, ఆదిలాబాద్ రిమ్స్, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. ఇందులో మహబూబ్‌నగర్ (2016), సిద్దిపేట (2018), సూర్యాపేట, నల్గొండ (2019)లో తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రారంభమయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈఎస్‌ఐ (2016), ఎయిమ్స్ (2019)లో వైద్యకళాశాలలు ప్రారంభించింది. తాజాగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లలో ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఈ కళాశాలల ఏర్పాటులో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.
మహబూబాబాద్, కొత్తగూడెం గిరిజనులు ఎక్కువగా నివసించే ఏజెన్సీ ప్రాంతాలు కాగా వనపర్తి, జగిత్యాల, మంచిర్యాల సైతం మారుమూల జిల్లాలు. వైద్య కళాశాలలతో పాటు దానికి అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి ఏర్పాటవుతుంది. కళాశాల ఏర్పాటుకు 250 ఎకరాల వరకు స్థలం అవసరం. వీటివల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
సీఎంకు మంత్రులు, ప్రజాప్రతినిధుల కృతజ్ఞతలు..
రాష్ట్రంలో ఆరు కొత్త వైద్యకళాశాలలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 చోట్ల ప్రాంతీయ ఉప కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాఠోడ్, పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒకేసారి 6 వైద్యకళాశాలల మంజూరు దేశంలో ఎక్కడా లేదని, కేసీఆర్‌దే ఈ ఘనత అన్నారు.
ఇదీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు: కేసీఆర్