Women Day Celebrations in Telangana: వివిధ రంగాల్లో మెరుగైన సేవలు అందించిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రకటించింది. 2023 సంవత్సరానికిగాను మొత్తం 27 మందిని అవార్డులకు ఎంపిక చేశారు. అవార్డులు పొందిన వారికి లక్ష రూపాయల నగదు పురస్కారంతో పాటుగా వారికి ప్రభుత్వం తరుపున సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవార్డు పొందిన వారిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ముఖ్రాకే గ్రామ సర్పంచ్ మీనాక్షి గాడ్గే, ఐపీఎస్ అధికారి అనసూయ, అంగన్ వాడీ టీచర్ బానోతు జ్యోతి, మౌంటెనీర్ అన్వితా రెడ్డి, మహిళా క్రికెటర్ గొంగడి త్రిష, ఆశా వర్కర్ కృష్ణవేణి, ఏఎన్ఎం ఇందిర, ఉమెన్ ఎంటర్పెన్యూర్ సమంతా రెడ్డి, షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ రుక్మిణి, పేట్లబుర్జు ఆసుపత్రి సూపరింటెండెంట్ మాలతి తదితరులు ఉన్నారు.
Holiday for Women employees on Womens Day: మహిళా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు మార్చి 8న సర్కార్ సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రకటిస్తూ.. ప్రభుత్వ సీఎస్ శాంతి కుమారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సెర్ప్, మెప్మా మహిళలకు ఈ రుణాలను అందిస్తామని పేర్కొన్నారు. వీటికి సంబంధించి ఈనెల 8న రూ.750 కోట్లు రుణాలను విడుదల చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
మహిళా వారోత్సవాలు: మహిళ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఘనంగా మహిళా వారోత్సవాలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో మహిళల శక్తిని, పాత్రను గుర్తు చేసుకునేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని ఆయన సూచించారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజు నుంచి ఈ వారోత్సవాలు నిర్వహించనున్నారు. వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
మహిళల కోసం స్పెషల్ బస్సులు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళలకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళ దినోత్సవం రోజున మహిళలు, విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. నగర శివారు ప్రాంతాల్లో చదివే విద్యార్థినుల కోసం లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు సంస్థ తెలిపింది.
ఇవీ చదవండి:
మహిళ దినోత్సవం సందర్భంగా స్త్రీలకు ఎంపీ సంతోష్ సరికొత్త ఛాలెంజ్..
మహిళా దినోత్సవం స్పెషల్.. 'ఆరోగ్య మహిళ'కు ప్రభుత్వ శ్రీకారం
ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే యువత అద్భుతాలు సృష్టిస్తారు: గొంగడి త్రిష