covid third wave in telangana : కరోనా మూడో దశ కమ్ముకొస్తున్న నేపథ్యంలో... సన్నద్ధతపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌రావు బుధవారం సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఆసుపత్రి అధికారులతో చర్చించారు. గాంధీ, టిమ్స్ వైద్యశాలలను అన్ని విధాలుగా సిద్ధం చేసింది.
‘గాంధీ’లో ఇదీ పరిస్థితి
తొలి, రెండో దశల్లో గాంధీ ఆస్పత్రిలో లక్షన్నర మంది వరకు కరోనా బాధితులు చికిత్స పొందారు. రెండో దశ దాదాపు తగ్గుముఖం పట్టడంతో గాంధీ ఆసుపత్రిలో కేవలం 200 పడకలు మాత్రమే కొవిడ్‌కు కేటాయించారు. ప్రస్తుతం 60 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మూడో దశ తీవ్రరూపు దాలిస్తే మొత్తం 1800 పడకలను కొవిడ్ రోగులకే కేటాయించాలని సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశానుసారం 6 ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అన్ని పడకలకు నిరంతరాయంగా ప్రాణవాయువు అందించడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. కొవిడ్ బాధితులు పెరిగితే సామాన్య రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించాలనుకుంటున్నారు.
టిమ్స్‌లో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు
టిమ్స్‌లో 1250 పడకలున్నాయి. ప్రస్తుతం 64 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో అధికులు ఒమిక్రాన్ బాధితులే. అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. 150 వెంటిలేటర్లను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా రెండు ఆక్సిజన్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేశారు. కేసులు భారీగా పెరిగితే సరోజినీదేవీ కంటి, ఛాతీ, ఈఎన్‌టీ ఆస్పత్రి తదితరాలను వినియోగించాలని నిర్ణయించారు. చిన్న పిల్లల కోసం నిలోఫర్‌లో వెయ్యి పడకలకు పైగా సిద్ధం చేశారు.
మేం సిద్ధం: డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గాంధీ నోడల్ అధికారి
అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించడంతోపాటు వెంటిలేటర్లన్నీ సిద్ధంగా ఉంచాం. కరోనా బాధితులు పెరిగితే అన్ని పడకలను కేటాయించడానికి చర్యలు చేపడతాం.
ర్యాలీలు, సమావేశాలపై ఓయూలో నిషేధం
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ దృష్ట్యా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల పదో తేదీ వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. క్యాంపస్‌లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి సూచించారు. ప్రాంగణంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయడం, ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి తనిఖీ చేయాలని ఆదేశించారు. క్యాంపస్‌లో మత, రాజకీయ, సాంస్కృతిక సంబంధ సమావేశాలపై నిషేధం విధించినట్లు తెలిపారు.
జీహెచ్‌ఎంసీలో979 కేసులు నమోదు
ఈనాడు, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో బుధవారం ఏకంగా 979 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో వ్యాక్సిన్ చేయించుకోని వారే ఎక్కువ మంది ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
సొంతూళ్లకు పయనం..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కొందరు ముందుగానే సొంతూళ్లకు పయనమయ్యారు. ఎల్బీనగర్లో ఆమేరకు రద్దీ కన్పిస్తోంది.
ఇదీ చూడండి: Covid Tests in Telangana : తెలంగాణలో రోజుకు లక్ష కరోనా నిర్ధరణ పరీక్షలు!